పద్మవిభూషణ్ ని కలిసిన పద్మశ్రీలు

Padma Vibhushan

ఇటీవలే పద్మవిభూషణిడిగా మారారు మన మెగాస్టార్ చిరంజీవి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు చిరంజీవిని వరించింది. అలాగే తెలంగాణకు చెందిన పలువురు పేద కళాకారులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

ఆ పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు మెగాస్టార్. జనగాంకి చెందిన యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, డాక్టర్. ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు.

జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇటీవల “బలగం” సినిమాలో కూడా పాడారు. 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

యాదాద్రి ఆలయాన్ని సంపూర్ణంగా కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో డాక్టర్‌ ఆనందచారి వేలు కీలకంగా వ్యవహరించారు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా అహర్నిశలు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరమని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిలతో చేపట్టిన పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

శిఖరాగ్రస్థాయిలో ఉన్న చిరంజీవి గారు తమను వారి ఇంటికి ప్రత్యేక ఆహ్వానం పంపించి, సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని సమ్మయ్య, వేలు సంతోషం వ్యక్తంచేశారు.

Advertisement
 

More

Related Stories