పాన్ ఇండియానా? పాన్ డబ్బానా?

“బాహుబలి” ఫ్రాంచైజీతో టాలీవుడ్ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. రాజమౌళి, ప్రభాస్… పాన్ ఇండియా సెలబ్రిటీస్ గా మారారు. 

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి ఇతర పెద్ద హీరోలకి పాన్ ఇండియా స్టార్లగా ఇమేజ్ లేదు కానీ వారిని ఇండియాలో గుర్తుపట్టని వారు ఉండరు… మన దేశంలో టాప్ పాపులర్ స్టార్స్ లలో వీరు ఉన్నారు. నేటి తరంలో విజయ్ దేవరకొండకి ఇండియన్ మెట్రో సిటీస్ లో మంచి గుర్తింపు ఉంది… కానీ ఇంకా అతనికి కూడా పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు. 

ఐతే వీరంతా పాన్ ఇండియా కోసం సినిమాలు ప్లాన్ చేస్తే తప్పు పట్టలేము.

కాస్త స్టార్ డమ్ ఉండి, బడ్జెట్ పెట్టగలిగే సత్తా ఉన్న మేకర్స్.. స్టార్ హీరోలతో పాన్-ఇండియా సినిమాలు రూపొందించే పనిలో పడ్డారు. అయితే రానురాను పాన్ ఇండియా అనే పదం వాస్తవరూపంలోకి వచ్చేసరికి ప్రచారాస్త్రంగా మారిపోయింది. ఎంతలా అంటే ఏకంగా పాన్-ఇండియా అనే పదానికి అర్థం మరిచిపోయేలా చేస్తున్నారు కొంతమంది టాలీవుడ్ మేకర్స్.

ఏదైనా కథను సెలక్ట్ చేసుకుంటే.. భాషా, ప్రాంతానికి అతీతంగా అది ఉండాలి. కథలో అంత కాన్వాస్ ఉండాలి. హీరోహీరోయిన్ల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ వివిధ భాషల ప్రజలకు తెలిసినవారై ఉండాలి. సినిమాను కనీసం 2-3 భాషల్లో తీయగలగాలి. మిగతా భాషల్లో డబ్బింగ్ చేసి.. ఒకేసారి సైమల్టేనియస్ గా రిలీజ్ చేయగలగాలి. పాన్-ఇండియన్ మూవీ లక్షణాలివి.

కానీ కొంతమంది టాలీవుడ్ మేకర్స్ పాన్ ఇండియాను ప్రచారం కోసం వాడడం మొదలుపెట్టారు. తమ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీ అని గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 2 సెంటర్ లలో కూడా నిలబడలేని హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అంటూ సినిమాలు ప్రకటించడంతో జనాలు నవ్వుకుంటున్నారు.

ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటిస్తే ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ లో మాట్లాడుకునేలా ఉండాలి. మేకర్స్ పట్టించుకోకపోయినా సౌత్-నార్త్ మీడియా ఎగబడి కవరేజీ ఇవ్వాలి. పాన్ ఇండియా మూవీ అప్పీల్ అంటే ఇది. యూనిట్ పట్టించుకోకపోయినా మీడియా, ఆ సినిమాను భుజానికెత్తుకోవాలి. అంతే తప్ప.. తమకుతాముగా మేకర్స్ తమది పాన్ ఇండియా సినిమా అని ప్రకటించుకుంటే సరిపోదు.

అప్పుడది పాన్ ఇండియా సినిమా అవ్వదు, పాన్ డబ్బా సినిమా అవుతుంది.

Related Stories