
“అయ్యపనం కోషియం” అనే మలయాళ సినిమా… తెలుగులో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి, ఈ పాత్ర పేరు గురించి చాలా పుకార్లు వచ్చాయి. అందుకే, ఈ పుకార్లకు తెరదించుతూ పవన్ పాత్ర పేరు ఏంటో రివీల్ చేసింది మూవీ టీం.
ఇంతకుముందు కొమరం పులిలా మరోసారి గిరిజన తెగకి చెందిన పోలీసు పాత్రలో పవన్ కళ్యాణ్ దర్శనమిస్తున్నారన్నమాట. రానా సైనికుడిగా కనిపిస్తారు. వీరిద్దరి మధ్య ఉండే ఇగో సమస్యే సినిమా కథకి మూలం.
సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. నాలుగు నెలల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి వచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు. ఐతే, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) నాడు ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తారని టాక్.
పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.