
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా భవదీయుడు భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమాపై చాలా పుకార్లు చెలరేగాయి. పవన్ ఈ సినిమాను మరోసారి వాయిదా వేశాడని కొందరు, ఏకంగా సినిమాను పక్కనపెట్టాడని మరికొందరు, అసలు హరీశ్ శంకర్ దగ్గర పూర్తిస్థాయి స్క్రీన్ ప్లే లేదని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా పుకార్లు పుట్టించారు.
ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా పవన్ కల్యాణ్ స్పందించాడు. అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన పవన్ కల్యాణ్.. హరీశ్ శంకర్ తో తను చేయాల్సిన సినిమా ఉందని స్పష్టం చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను త్వరలోనే చేయబోతున్నానని పవన్ స్వయంగా ఎనౌన్స్ చేశారు.

పవన్ ప్రకటనతో ఈ సినిమాపై ఇన్నాళ్లు షికారు చేసిన పుకార్లు ఆగిపోయాయి. అయితే ఇంకొక్క క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. వాటిపై కూడా స్పష్టత వచ్చేస్తే, ప్రాజెక్టుపై ఇక ఎవ్వరికీ ఎలాంటి డౌట్స్ ఉండవు.