
పవన్ కళ్యాణ్ హీరోగా అడుగుపెట్టి 27 ఏళ్ళు. పవన్ కళ్యాణ్ తొలినాళ్లలో చేసిన సినిమాలు యూత్ ని ఊపేశాయి. అప్పుడు టీనేజ్ లో ఉన్న వారే ఇప్పుడు హీరోలుగా, దర్శకులుగా మంచి పొజిషన్ లో ఉన్నారు. అందుకే, వీరికి పవన్ కళ్యాణ్ తొలినాటి సినిమాలపై ప్రత్యేక ప్రేమ. అందుకే ఆయన అప్పటి సినిమాల టైటిల్స్ కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది.
తాజాగా నితిన్ “తమ్ముడు” అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభం అయింది. “తమ్ముడు” సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక బిగ్ హిట్. హిందీలో హిట్ అయిన “జో జీతా వొహి సికిందర్” ఆధారంగా రూపొందిన “తమ్ముడు” చిత్రం 1999లో విడుదలైంది. ఆ టైటిల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నితిన్ సినిమాకి వాడేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన “ఖుషి” చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. “ఖుషి” పవన్ కళ్యాణ్ కెరీర్లో ఏడో చిత్రం. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. “ఖుషి” సినిమాతోనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా స్థిరపడిపోయారు. ఇప్పుడు అదే టైటిల్ ని విజయ్ దేవరకొండ వాడేస్తున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా ఆ మధ్య “తొలి ప్రేమ” వచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి భారీ బ్లాక్ బస్టర్ …తొలిప్రేమ. ఇలా ముగ్గురు యువ హీరోలు పవన్ కళ్యాణ్ ఐకానిక్ చిత్రాల టైటిల్స్ ని వాడేశారు.