
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం – బీజేపీతో కలిసి పోటీ చేయనుంది. ఈ మూడు పార్టీల కూటమి ఇప్పటికే ఫిక్స్ అయింది. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
ఐతే, తాజాగా పవన్ కళ్యాణ్ తాను భీమవరం వదులుకోను అని ప్రకటించారు. “భీమవరం నాది,” అని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చెయ్యగా ఓడిపోయారు. అయినా భీమవరం నాది అని తాజాగా ప్రకటించారు. ఐతే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్.
తమ కూటమి అధికారంలోకి వస్తుంది అని జనసేనాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 లెక్కలు వేరు, ఇప్పుడు వేరు అంటున్నారు. ఇప్పటివరకు మెగాస్టార్ – పవర్ స్టార్ కుటుంబం నుంచి ఎవరూ గోదావరి జిల్లాల నుంచి గెలవలేకపోయారు. చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ఈ జిల్లాల నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. మరి ఈ సారైనా జాతకం మారుతుందా?