
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆగస్టు 22 అంటే మెగాస్టార్ అభిమానులకు పెద్ద పండుగ. ఐతే, ఈసారి చిరంజీవి ఎలాంటి పుట్టిన రోజు పార్టీలు ఇవ్వడం లేదు. ఎలాంటి సెలెబ్రేషన్ లో పాల్గొనబోవడం లేదు. చిరంజీవి మోకాలికి ఇటీవలే శస్త్ర చికిత్స జరిగింది. దాంతో, ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇక అన్నయ్యకి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక రోజు ముందే విషెష్ చెపుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
“అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి, మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి, మేము కూడా ఎదిగేందుకు ఓ మార్గం చూపడమే కాకుండా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయతీ, సేవాభావం నావంటి ఎందరికో ఆదర్శం.
కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం కూడా మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చసు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగంలో అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya.. !”