
GHMC ఎన్నికలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్లే. మొదట తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపుతాను అని ప్రకటించారు. ఐతే, బీజేపీ, జనసేనతో పొత్తుకు, సీట్ల పంపకానికి ఒప్పుకోలేదు. దాంతో, పోటీ నుంచి జనసేన తప్పుకొంది. ఐతే, పవన్ కళ్యాణ్ ఒక రోజు లేదా రెండు రోజులు హైదరాబాద్ గల్లీలల్లో ప్రచారం చేస్తారని అనుకున్నారు. కానీ, పవన్ కళ్యాణ్ బీజేపీ గెలుపునకు జనసేన కార్యకర్తలు పనిచేయాలని ఇంతకుముందే పిలుపునిచ్చి ఊరుకున్నారు.
ఇకముందు ప్రచారం చెయ్యరు. ఆదివారంతో (నవంబర్ 29) ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సో… పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటున్నట్లే. ఆయన డిసెంబర్ 1న ఓటు కూడా వెయ్యరు. ఎందుకంటే… తన ఓటు హక్కును మొన్నటి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో అమరావతికి మార్చుకున్నారు.
జనసేన ఇక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టనుంది. మరోవైపు, ఆయన తన “వకీల్ సాబ్” షూటింగ్, నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కార్యక్రమాలతో వచ్చే నెల బిజీగా ఉంటారు.