
తమిళ సినిమాల్లో ఇకపై తమిళ నటులను మాత్రమే తీసుకోవాలని అక్కడి చిత్రపరిశ్రమకి చెందిన కార్మికుల, నటుల సంఘం తీర్మానాలు చేసింది. దీనిపై ఇంకా ఆ పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ, దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. “బ్రో” సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన తమిళ సినిమాకి కొన్ని సలహాలు, విన్నపాలు చేశారు.
తమిళ సినిమా పరిశ్రమలో తమిళీయులే ఉండాలన్న ఆలోచనని అక్కడివాళ్లు విరమించుకోవాలి. ఈ రోజు “ఆర్ ఆర్ ఆర్” వంటి తెలుగు సినిమాని ప్రపంచం అంతా చూసింది. భారతీయ సినిమా గ్లోబల్ వేదికపై గొప్పగా ఎదగాలంటే ఇలాంటి సంకుచిత విధానాలు విడనాడాలి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ సూచన చేశారు.
అన్ని భారతీయ సినిమా పరిశ్రమలు ఒకటే. మనం గిరిగీతలు గీసుకోవద్దు అని కోరారు పవన్ కళ్యాణ్.
తెలుగు సినిమాల్లో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ… ఇలా అన్ని భాషలకు, ప్రాంతాలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణలు పనిచేస్తున్నారు. తమిళ చిత్రాల్లో కూడా ఆ పద్దతి ఏళ్లుగా ఉంది. ఐతే, తమిళ సినిమాల షూటింగ్ లు ఎక్కువగా హైదరాబాద్ లో జరుగుతున్నాయి. అలాగే, ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో తీస్తున్నారు. అందుకే, అక్కడ సినీ కార్మికులకు, చిన్న నటులకు సరైన పని దొరకడం లేదు.
“కార్మికులకు సమస్యలు ఉంటే వాటికి పరిస్కారం దిశగా తమిళ పరిశ్రమ చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇతర భాషలకు చెందిన నటులపై నిషేధం పెట్టకూడదు,” అని పవన్ తెలిపారు.