ఆ కలానికి ఎన్ని పాళీలో: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కలం బలం అందించారు. పవన్ కళ్యాణ్ రెండో చిత్రం ‘గోకులంలో సీత’ నుంచి ‘అజ్ఞాతవాసి’ లోని “గాలివాలుగా” వరకు సిరివెన్నెలలు కురిసిన గీతాలు అనేకం.

సీతారామశాస్త్రి గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారు.

“వాగ్దేవి వరప్రసాదంగా మన తెలుగునాట నడయాడిన విద్వత్కవి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. బలమైన భావాన్ని… మానవతావాత్వాన్ని… ఆశావాదాన్ని చిన్నచిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి శ్రీ శాస్త్రి గారు. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది,” అన్నారు పవన్ కళ్యాణ్.

“అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శాస్త్రి గారు కోలుకొంటారు అని భావించాను. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ సీతారామశాస్త్రి గారు మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు… తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. వారిని కేవలం సినీ గీత రచయితగా చూడలేం.”

సిరివెన్నెల పాటల్లోని గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో తెలిపారు. “ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. నేను నటించిన సుస్వాగతంలో ‘ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి..’ పాట కావచ్చు, ‘తొలిప్రేమ’లో ‘ఈ మనసే..’ పాటల్లో అలతి అలతి పదాలతో ప్రేమ భావనలు చెప్పారు. ప్రేమ గీతాలు, అల్లరి పాటలు.. ఏవైనా అంతర్లీనంగా మంచి చెప్పాలని తపించేవారు,” అని పవన్ కళ్యాణ్ వివరించారు.

“ఒక కవిగా సమాజాన్ని నిలదీసి, బాధ్యతలు గుర్తు చేసేవారు. ‘నిగ్గదీసి అడుగు…’, ‘అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని..’ లాంటి పాటలు వింటే సమాజాన్ని నిత్యచైతన్యంగా ఉంచాలని శ్రీ శాస్త్రి గారు ఎంత తపించారో అర్థం అవుతుంది. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు…’, ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..’ లాంటి పాటల్లో ఆశావాదాన్ని అందించారు. భావితరాలకు మన తెలుగు సాహితీ సంపదను వారసత్వంగా ఇవ్వాలని తపించేవారు. శాస్త్రి గారి రచనల్లోని వైవిధ్యాన్ని చూస్తే ఆయన కలానికి ఎన్ని పాళీలో అనిపిస్తుంది,” అని అన్నారు జనసేనాని.

“శ్రీ సీతారామ శాస్త్రి గారి మరణం వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో లోటు. నాపట్ల ఎంతో అప్యాయతను కనబరిచేవారు. వారితో మాట్లాడితే – సాహిత్యం, ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయ వాదం, సామ్యవాదం వరకూ ఎన్నో అంశాల గురించి కూలంకషంగా చెప్పేవారు. శ్రీ శాస్త్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.”

Advertisement
 

More

Related Stories