
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలుకి గ్రేట్ ట్రిబ్యూట్ ఇచ్చారు. పాట తాలూకు సోల్ ని పట్టుకున్న గాయకుడు అని అభివర్ణించారు.
“అమృతం గొంతు నిండా నింపుకున్న స్వరం శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిది. ఏ భాషలోనైనా ఏ తరహా గీతాన్నైనా అలవోకగా గానం చేసి సంగీతప్రియులను ఉర్రూతలూగించారు. సినీ సంగీత ప్రపంచంలో ధృవ తారలా నిలిచిన శ్రీ బాలు గారు తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. గత కొద్ది వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన కోలుకొంటారని ఆశించాను. శ్రీ బాలు గారు శివైక్యమ్ కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు.
“శ్రీ బాలు గారు లేని లోటు తీరనిది… లాంటి చిన్న పదాలతో ఆయనకు నివాళి అర్పించడం కష్టమే. పాట ఆత్మను ఆవాహన చేసుకొని సాహిత్యానికి ప్రాణం పోసిన మధుర గాయకుడాయన. శ్రీ బాలు గారికి తెలుగు భాష మీద ఉన్న మమకారం… పదాన్ని తప్పులు లేకుండా పలకాలనే తపన… నవతరం గాయకులకు ఆదర్శప్రాయమైనవి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన సొంతం. నా చిత్రాల్లో ఎన్నో హిట్ గీతాలు గానం చేశారు. మా కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీ బాలు గారు కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.”
మరోవైపు, త్రివిక్రమ్ కూడా తనదైన శైలిలో కవితతాత్మకంగా నివాళి ఇచ్చారు.
ఎస్ పి బి
మూడు తరాల్ని
ఉర్రూతలూగించిన మూడక్షరాలు
కొందరికి వయసు రాదు.
మరణం ఉండదు.
బాలు గారు కూడా వాళ్ళలో ఒకరు.
ఆయన ప్రతిభ అపారం..
ఆయన కీర్తి అమరం..
ఆయన పాట చిరస్మరణీయం..
వారి కుటుంబ సభ్యులకు
ప్రపంచం నలుమూలల
అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి…వాళ్ళలో నేను కూడా ఒకడిని
అందరికీ నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను
- త్రివిక్రమ్