ఆ సినిమాకి మోదీ ప్రచారం

ఒక దేశ ప్రధాని సినిమాలను ప్రమోట్ చెయ్యడం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కానీ మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ శైలి గత ప్రధానులకు విభిన్నం. ఇంతకుముందు ఒకసారి ఒక సభలో “కట్టప్ప కో క్యూ మారా” అంటూ బాహుబలి సినిమాని ప్రస్తావించారు. ఇక “యూరి: ది సర్జికల్ స్ట్రైక్”, “కాశ్మీర్ ఫైల్స్” వంటి సినిమాలను బీజేపీ తమ సినిమాలుగా ఓన్ చేసుకొని సూపర్ హిట్ చేశాయి. అంతేకాదు, ప్రధాని మోదీ “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకి పూర్తి మద్దతు ప్రకటించారు. మొత్తం తన ప్రభుత్వ పరంగా, పార్టీపరంగా ఆ సినిమాకి కావాల్సిన అండదండలు అందించారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఐతే, ఇప్పుడు ఆయన ఏకంగా ఒక ఎన్నికల ప్రచారంలో ఒక సినిమా గురించి గొప్పగా చెప్పడం అందరినీ ఆశ్చ్యర్యపరిచింది. ప్రధాని హోదాలో ఉండి ఒక సినిమా గురించి ఎన్నికల ప్రచారంలో ప్రచారం కల్పించడం విడ్డూరం. “ది కేరళ స్టోరీ” అనే సినిమా నిన్న (మే 5) దేశవ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమా ప్రస్తావన తెచ్చారు ప్రధాని. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించేందుకు ఆయన ఈ చిత్రానికి పబ్లిసిటీ కల్పించడం విశేషం.

“కేరళలో జరిగిన వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ‘ది కేరళ స్టోరీ’లో. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ అతివాద సంస్థలకు, శక్తులకు మద్దతిస్తోంది. ఈ సినిమాలో నిజాలు చూపించారు,” అంటూ ప్రధాని శుక్రవారం విడుదలైన చిత్రం గురించి ప్రస్తావించారు.

కేరళలో కనిపించకుండా పోయిన కొంతమంది యువతులు ఆ తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS)లో చేరారు అనే కథాంశంతో బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించాడు ఈ చిత్రాన్ని. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అదా శర్మ హీరోయిన్ గా నటించింది.

ఊహించనట్లుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకొంది. ఏకంగా ఏడు కోట్ల రూపాయల ఓపెనింగ్ తెచ్చుకొంది ఈ మూవీ. మొదటి రోజు కలెక్షన్లతోనే సూపర్ హిట్ అయింది. ఇక ప్రధాని, బీజేపీ కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటుండడంతో ఈ సినిమాకి ఇంకా కలెక్షన్లు పెరుగుతాయి.

Advertisement
 

More

Related Stories