
నందమూరి బాలకృష్ణ గురించి ఇటీవల ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఉంది. దాంతో, బాలయ్యని ఇరుకున పెట్టేందుకు అధికార వైఎస్సార్ పార్టీకి చెందిన నేతలు కేఎస్ రవికుమార్ మాటలను వైరల్ చేస్తున్నారు.
వైసీపీ బ్యాచ్ కి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ ఫ్యాన్స్. ఏది ఏమైనా బాలయ్య విగ్గు రాజకీయ చర్చకి తెరతీయడం విశేషమే.
“బాలయ్యకి కోపం ఎక్కువ. సెట్ లో ఎవరైనా నవ్వితే ఆయనకి మండుతుంది. ఒకసారి షాట్ గ్యాప్ లో బాలయ్య నిల్చున్నారు. మా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ పొరపాటున ఫ్యాన్ ని బాలయ్య వైపు తిప్పాడు. ఆ ఫ్యాన్ గాలికి ఆయన విగ్గు జరిగింది. అది చూసి శరవణన్ నవ్వాడు. దాంతో బాలయ్యకి కోపం వచ్చింది. అతని చెంప వాయిస్తాడేమో అని భయపడి అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ సార్. పొరపాటున చేశాడు కావాలని కాదు అన్నాను. కానీ అయన బాలయ్య ఆ రైవల్ గ్యాంగ్ కి చెందినవాడేమో వీడు అన్నారు. కాదు అని చెప్పా… నా సినిమాలకు చాలా కాలంగా అసిస్టెంట్ గా చేస్తున్నాడు అని చెప్పాను,” ఇలా సరదాగా జరిగిన ఒక ఉదంతాన్ని ఆయన బయటపెట్టాడు. దాంతో అక్కడ ఉన్న వారు అందరూ నవ్వారు.
అదే వేదికపై బాలయ్యది మంచి వాడు అని కూడా అన్నారు. నటులు సెట్లో ఎలా చికాకుకు గురి అవుతారో చెప్పడానికి ఆయన చెప్పారు.
ఐతే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ బాలయ్య విగ్గుని ఒక పెద్ద చర్చగా మార్చారు. బాలయ్య ఎవరు నవ్వినా ఓర్వలేని తనంతో కుళ్ళుకుంటాడంటూ వాళ్ళు కె.ఎస్. రవికుమార్ మాటలకు మసాలా జోడిస్తున్నారు.
రజినీకాంత్ కి “ముత్తు”, “నరసింహ” వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన రవికుమార్ తెలుగులో “బావ నచ్చాడు”, “స్నేహం కోసం”, “విలన్” వంటి సినిమాలు తీశారు. ఇక బాలయ్యతో “జై బాలయ్య”, “రూలర్” చిత్రాలు రూపొందించారు.