
మణిరత్నం తీస్తున్న “పొన్నియన్ సెల్వన్” నుంచి ఐశ్వర్య రాయ్ ఫోటో లీకైంది. ఇందులో ఆమె రాణి పాత్ర పోషిస్తున్నారు. ఆ గెటప్ లో ఆమె షూటింగ్ చేస్తుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఐశ్వర్య రాయ్ ఫోటో లీక్ కావడంతో దర్శకుడు మణిరత్నం తన టీంపై మండిపడ్డారట. అంతేకాదు, సినిమా షూటింగ్ వద్ద మరింత భద్రత పెంచారు మణిరత్నం.
“పొన్నియన్ సెల్వన్”… రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం వచ్చే ఏడాది విడుదలవుతుంది. కార్తీ, విక్రమ్, త్రిష, ఐశ్వర్య, జయం రవి, ప్రకాష్ రాజ్… ఇలా భారీ తారాగణం ఉంది ఈ మూవీలో. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న నవల ఆధారంగా తీస్తున్నారు. ఇది చోళుల కథ. చోళుల రాణిగా ఐశ్వర్య రాయ్ నటిస్తున్నారు.
మణిరత్నం తీసిన ‘ఇద్దరు’ చిత్రంతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యారు ఐశ్వర్య. మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ కూడా ఆయన సినిమాతోనే మొదలు పెట్టారు. 47 ఏళ్ల ఐశ్వర్య ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. మనసుకు నచ్చిన చిత్రాలే ఒప్పుకొంటోంది.
ఈ సినిమాని “బాహుబలి”కి మించి భారీగా తీయాలని మణిరత్నం ప్రయత్నిస్తున్నారు. అందుకే, సినిమాలో నటిస్తున్న నటుల గెటప్స్ ముందే లీక్ కాకుండా చూసుకోవాలని తన టీంని ఆదేశించారు ఆయన. రిలీజ్ కి ముందు ఒక్కొక్కరి గెటప్ ఒక ప్లాన్ ప్రకారం విడుదల చేస్తారట. ముందే లీక్ అయితే జనాల్లో సర్ప్రైజ్ ఉండదు కదా!