
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టాలీవుడ్ ను విస్తరించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఓ కార్యాచరణ రూపొందించే ఆలోచనలో ఉంది. అటు కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఓ నివేదిక తయారుచేసి సీఎం జగన్ కు అందజేశారు.
ఈ నేపథ్యంలో పోసాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. వీలైతే తను ఆంధ్రప్రదేశ్ లో స్టుడియో ఏర్పాటుచేస్తానంటున్నారు పోసాని.
“ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఓ స్టుడియో ఏర్పాటుచేయాలనేది నా చిన్న కొడుకు ఆలోచన. ఈమధ్యే తన ఆలోచనను నాతో పంచుకున్నాడు. అప్పటివరకు నాకు ఆ ఆలోచన రాలేదు. నిజమే, అది మంచి ఆలోచనే. ఏపీలో స్టుడియో ఏర్పాటుచేయొచ్చు. ఓ 5 ఎకరాలు ప్రభుత్వాన్ని కోరవచ్చు. ఇండస్ట్రీలో 35 ఏళ్లుగా ఉంటున్నాను. స్టుడియో ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వాన్ని స్థలం కోరే హక్కు నాకు ఉంది.”
ఇలా స్టుడియో ఏర్పాటుచేసే అంశంపై తన మనసులో మాట బయటపెట్టారు పోసాని. తనకు పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించినప్పటికీ తను ఎలాంటి పదవులు తీసుకోలేదంటున్నారు పోసాని. కాబట్టి ఈయన వెళ్లి ముఖ్యమంత్రిని అడిగితే స్థలం కేటాయించడం గ్యారెంటీ.