
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కి వీర అభిమాని పోసాని కృష్ణమురళి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చెయ్యడంతో పోసాని ఆయనికి సోమవారమే కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ మంగళవారం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఐతే, మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో వాడిన భాషను చూసినవారంతా విస్మయం చెందారు. ఇంతవరకు ఎవరూ అంత దిగజారుడు మాటలు ఒక ప్రెస్ మీట్ లో వాడి ఉండరు.
వీధుల్లో కొట్టుకొనే వారు వాడే తిట్లను నిసిగ్గుగా ఉపయోగించారు పోసాని. అన్ని “ల”కారలే. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూతురి ప్రస్తావనని కూడా తన బూతుపురాణంలోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూతురు పెద్దది అయిన తర్వాత ఇంతకుమించి అనుభవిస్తుంది అన్న అర్థంలో ఒక మైనర్ బాలికని తన రాజకీయ రచ్చలోకి లాగారు.
పోసాని మంచి రచయత. కానీ ఆయన భాష మాత్రం మరీ నేలబారు అని అర్థమైంది. రాజకీయ విమర్శలు సహజం. కానీ లైవ్ ప్రెస్ మీట్ లో “ల…. కొ..” అంటూ అనేకసార్లు ఆయన వాడడం ఎంత ఘోరమో చెప్పాల్సిన ఆవసరం లేదు. ఆయన మాటలను కట్ చెయ్యకుండా టీవీ ఛానెల్స్ చూపించడం కూడా నేరం.
మొన్న పోసాని పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు జనసేనాని అభిమానులని మాత్రమే బాధించాయి. మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయ విమర్శలుగానే చూశారు. కానీ ఈ రోజు తటస్తులు కూడా పోసాని దిగజారుడు మాటలని చూసి అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది. పోసాని తన స్థాయిని పూర్తిగా తగ్గించుకున్నాడు ఇలాంటి బజారు వ్యాఖ్యలతో.