
ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న విడుదలైంది. వెంటనే, ప్రభాస్ విదేశాలకు వెళ్ళారు. వెకేషన్ కోసం కాదు మోకాలి శస్త్ర చికిత్స కోసం. ఐదేళ్ల క్రితం షూటింగ్ లో జరిగిన గాయం తిరగబెట్టింది. యూరోప్ కి చెందిన ఒక పేరుగాంచిన వైద్యుడు ప్రభాస్ మోకాలికి సర్జరీ చేశారు.
ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లే. ఏప్రిల్ లో ‘సలార్’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటారు.
‘సలార్’ షూటింగ్ తో పాటు దర్శకుడు మారుతి సినిమా ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభాస్ ఇకపైన సినిమాల విషయంలో జాగ్రత్త పడే అవకాశం ఉంది. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఐతే, ‘సాహో’ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం, ‘రాధేశ్యామ్’ పూర్తిగా నిరాశపరచడంతో ప్రభాస్ అభిమానులు బాగా డీలాపడ్డారు. అందుకే, ప్రభాస్ ఇకపై మరింత జోష్ గా కనిపించేందుకు సిద్ధమయ్యారు.
‘ఆదిపురుష్’ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అది టార్గెట్ మిస్ కాదు అని ప్రభాస్ నమ్మకంగా ఉన్నారు.