అధునాతన హంగులతో ప్రసాద్ మల్టీప్లెక్స్

ప్రసాద్’స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటు. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు.

సరికొత్తగా ముస్తాబయిన స్క్రీన్లు జూలై 30, శుక్రవారం ‌నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది.

“రెన్నోవేషన్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రేక్షకులకు కొత్త స్క్రీన్లు మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తాయి. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా ఉద్దేశం. కరోనా వల్ల సినీ పరిశ్రమకు, ప్రజలకు చాలా హాని జరిగింది. ప్రజల ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దాం. మేం ఈ మల్టీప్లెక్స్ కట్టిన నాటి నుండి నేటివరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం,”అని ప్రసాద్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్అన్నారు.

“భారీగా ఖర్చు అయినప్పటికీ, ప్రేక్షకుల కోసం సరికొత్తగా మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దాం. త్వరలో ఐమాక్స్ తెరను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. మా నాన్నగారు ఎల్వీ ప్రసాద్ సినిమానే జీవితంగా బతికారు. దేశంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారు. ఆయన పిల్లలుగా మేం సినీ పరిశ్రమకు ఎంత సేవ చేయాలో అంతా చేస్తున్నాం. సినీ రంగంలో ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది” అని అన్నారు.

 

More

Related Stories