
ఊహించని విధంగా చిరంజీవి కరోనా బారిన పడ్డంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. మాస్క్ వేసుకోండి, చేతులు కడుక్కోండంటూ అందరికీ చెప్పిన మెగాస్టార్ కే కరోనా సోకడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. మొన్నటివరకు తమ అభిమాన నాయకుడి పిలుపు మేరకు లాక్ డౌన్ లో ముమ్మరంగా సహాయక చర్యలు, ఛారిటీ కార్యక్రమాలు చేపట్టిన మెగాఫ్యాన్స్.. ఇప్పుడు ఆలయాలు దర్శిస్తున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, ప్రార్థనలు చేస్తున్నారు.
చిరంజీవి అభిమానులంతా ఇప్పుడు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని మొక్కులు మొక్కుతున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్, అన్నయ్య సత్వరమే కోలుకోవాలని కాంక్షించారు. వ్యక్తిగతంగా అన్నయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. ప్రతి ఒక్కరికీ చైతన్యం కలిగించారని, అలాంటి వ్యక్తికి వైరస్ సోకడంతో అందరం ఆశ్చర్యపోయామని అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆయనకు ఎలాంటి లక్షణాల్లేవు కాబట్టి 2 వారాల తర్వాత, పూర్తి ఆరోగ్యంతో చిరంజీవి మనందర్నీ మరోసారి అలరించబోతున్నారు.