
ప్రియమణికి సడెన్ గా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది కన్నా బాలీవుడ్ లో ఆమెకి ఎక్కువ డిమాండ్ పెరిగింది అని చెప్పొచ్చు.
ఆమెని సౌత్ లో హీరోయిన్ గా తీసుకోవడం లేదు కానీ ప్రాముఖ్యం ఉన్న ప్రధాన పాత్రలకు తీసుకుంటున్నారు. ఆమె రీసెంట్ గా తెలుగులో “కస్టడీ”, ‘విరాటపర్వం’, ‘భామా కలాపం’ (వెబ్ సిరీస్) వంటివి చేశారు.
హిందీలో మాత్రం భారీ సినిమాలు, పెద్ద విజయాలు అందుకుంటున్నారు ప్రియమణి. గతేడాది షారుక్ ఖాన్ “జవాన్”లో నటించిన ఆమె ఈ ఏడాది “ఆర్టికల్ 370″తో మంచి విజయం అందుకున్నారు. ఇక త్వరలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన “మైదాన్”లో ఆమె హీరో భార్యగా నటిస్తుండడం విశేషం. అంటే అజయ్ దేవగన్ సరసన. ఇలా బాలీవుడ్ లో సడెన్ గా తనలాంటి దక్షిణాది హీరోయిన్లకు అవకాశాలు పెరుగుతుండడం మంచి పరిణామం అని అంటోంది.
“మేము బాలీవుడ్ హీరోయిన్ల కన్నా తక్కువమేమి కాదు. మంచి కలర్ లేకపోవచ్చు కానీ నటనలో కానీ, అందంలో కానీ బాలీవుడ్ భామలకు తీసిపోమని చెప్పగలను. అందుకే మాకు ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. అయినా సౌత్, నార్త్ అని కాకుండా ఇండియన్ టాలెంట్ అని చూడడం అందరూ అలవాటు చేసుకోవాలి” అని చెప్తోంది.