
విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ రెండో సినిమా ప్రకటించారు. ఈ సినిమాకి ‘JGM’ అనే పేరుని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. నిన్న ముంబైలో గ్రాండ్ గా ఈ మూవీ లాంచ్ అయింది. ఐతే, ఈ సినిమాకి మొదట పెట్టిన పేరు… జన గణ మన. మహేష్ బాబు హీరోగా ఈ కథని పదేళ్ల క్రితమే రాసుకున్నారు పూరి జగన్.
అప్పటినుంచి ‘జన గణ మన’ అనేది టైటిల్. కానీ, ఆయన అన్ని భాషల్లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చెయ్యడం మర్చిపోయారు. తాజాగా మలయాళంలో ఇదే పేరుతో ఒక సినిమా రూపొందింది. అది విడుదలకు సిద్ధంగా ఉంది. తాను అనుకున్న టైటిల్ లేకపోవడంతో అన్ని భాషల్లో ఒకటే టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో ‘జన గణ మన’ని షార్ట్ ఫార్మ్ లో ”JGM” అని మార్చేశారు పూరి.
“ఈ సినిమాలో హీరో ఒక ఆర్మీ అధికారి. దేశం కోసం, దేశ పౌరుల కోసం అతను ఒక మిషన్ చేపడుతాడు. ఆ మిషన్ పేరు… JGM. అందుకే అదే టైటిల్ పెట్టాను,” అని పూరి వివరణ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పటికే ‘లైగర్’ అనే సినిమా తీశారు పూరి. అది ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. ఇక ‘JGM’ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలవుతుంది.