
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కాదేది పబ్లిసిటీకి అనర్హం అనేది సినిమావారి పద్దతి. ప్రచారం కోసం ఎన్నో, మరెన్నో ఎత్తుగడలు వేస్తుంటారు మన నిర్మాతలు, హీరో, దర్శకులు, పబ్లిసిస్టులు. రీసెంట్ గా రెండు పెద్ద సినిమాల విషయంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి.
మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఉదయం పూట ‘సర్కారు వారి పాట’ టీజర్ ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ, అర్ధరాత్రి ఆ టీజర్ లీకు అయింది. దాంతో రాత్రి పన్నెండున్నరకి హీరో మహేష్ బాబు టీజర్ ని రిలీజ్ చేశారు. అలాగే, ఈ రోజు ‘పుష్ప’ మొదటి పాట విడుదల. కానీ నిన్న రాత్రే పాట బయటికి వచ్చింది. అది కూడా రఫ్ కట్.
ఈ రెండు లీకుల ఘటనలు చూస్తే…ఆ రెండు వాళ్ళ టీం నుంచి బయటికి వచ్చినవే అనిపిస్తోంది. టీజర్ బయటి జనాలకు ముందే చేరే అవకాశం లేదు లీక్ చెయ్యడానికి. ఆ సినిమా పబ్లిసిటీ టీమ్ నుంచో, డైరెక్టర్ టీం నుంచో బయటికి రావాలి. ఇక ‘పుష్ప’ పాటకి సంబంధించి రఫ్ కట్ ఎవరి దగ్గర ఉంటుంది?
సో, ఇవి నిజంగా లీకు అయ్యాయా? లీకు చేయించారా? అన్న అనుమానాలు రావడం సహజం కదా.
అందుకే… రామ్ గోపాల్ వర్మ తీసిన ‘అప్పల్రాజు’ సినిమాలోని పాట ఇక్కడ వేసుకోవాలి… “పబ్లిసిటీ …పబ్లిసిటీ… పబ్లిసిటీ…ఇది సినిమావాళ్ళ ఆక్టివిటీ…”