పుష్ప మూవీ – తెలుగు రివ్యూ

- Advertisement -
Pushpa

చూస్తుంటే.. సుకుమార్ పై ‘రంగస్థలం’ చాలా పెద్ద ప్రభావం చూపించినట్టుంది. ‘రంగస్థలం’ కోసం 1980 బ్యాక్ డ్రాప్ తీసుకుంటే, పుష్ప కోసం 1990ను ఎంచుకున్నాడు. రంగస్థలం కోసం గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ బ్యాక్ డ్రాప్ తీసుకుంటే, ‘పుష్ప’ చిత్తూరు జిల్లా అడవులు నేపథ్యం అయింది. హీరో పాత్ర చిత్రణలో కూడా ఈ రెండు సినిమాల మధ్య చాలా సారూప్యత కనిపిస్తుంది. ఎర్రచందనం ఉండే శేషాచలం అడవుల్లో పుష్ప అనే పాత్ర ఉంటే, అది ఎలా బిహేవ్ చేస్తుంది. ఆ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయనే డీటెయిలింగ్ ను సుకుమార్ అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.

సుకుమార్ సినిమాల్లో హీరో సగటు కథానాయకుడి లక్షణాలకు భిన్నంగా ఉంటాడు. పుష్పలో కూడా అంతే. పుష్పరాజ్ పాత్రలో చాలా లోతు ఉంది. అతని పేరు పుష్పరాజ్. కానీ పుష్ప అని మాత్రమే పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే తన తల్లికి పెళ్లి కాలేదు. ఊరిలో ఉండే ఒక భూస్వామి ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తాడు. వారిద్దరికీ పుట్టిన పుష్పరాజ్ తన తండ్రి పేరును, ఇంటిపేరుని వాడుకోనివ్వరు. ఆ భూస్వామి అసలు భార్య పెద్ద కొడుకు (అజయ్) పుష్పరాజ్ ని అవమానిస్తాడు. ఆ అవమానం వల్ల కసి పెరుగుతుంది పుష్పరాజ్ లో. అతనేమీ అందగాడు కాదు. పైగా చిన్న గూని కూడా. పోనీ మంచి పనులు చేస్తాడా అంటే, అది కూడా లేదు. ఎర్రచందనం స్మగ్మింగ్ చేస్తుంటాడు. డబ్బు సంపాదించాలి, తన ఏరియాలో కింగ్ అనిపించుకోవాలి. ఇంటిపేరు లేని తనను అందరూ గౌరవించాలి. ఇదే పుష్ప లక్ష్యం.

ఇప్పుడు సినిమా కథను పైపైన చెప్పుకుందాం.. శేషాచలం అడవుల్లో రోజుకూలీగా పనిచేస్తూ జీవితాన్ని గడిపే పుష్పరాజ్ (అల్లు అర్జున్) డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్ లోకి చేరతాడు. ఈ క్రమంలో కొండారెడ్డి (అజయ్ ఘోష్) నమ్మకం పొందుతాడు.అతని స్మగిలింగ్ వ్యాపారంలో భాగస్వామి అవుతాడు. మరోవైపు శ్రీవల్లి(రష్మిక) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. స్మగ్లింగ్ దందాలో భాగంగా మంగళం శీను (సునీల్) కి ఎదురెళ్ళి, లోకల్ ఎంపీ సహాయంతో స్మగ్లింగ్ సిండికేట్ కు బాస్ గా ఎదుగుతాడు. ఫైనల్ గా ఆ ఏరియాకి ఎస్పీ గా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో గొడవ పెట్టుకున్న పుష్ప ఫైనల్ గా ఏం సాధించాడనేది ఈ పుష్ప పార్ట్-1 కథ.

సుకుమార్ సినిమాల్లో కనిపించే టేకింగ్ పుష్పలో కూడా ఉంది. ఓ బ్యాంగ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. అదే ఊపుతో ఫస్టాఫ్ అంతా నడుస్తుంది. విలక్షణమైన పాత్రల ఎంట్రీ, మధ్యమధ్యలో కామెడీ, పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్, ప్రేమ సన్నివేశాలు.. ఇలా ఆసక్తికరంగా సాగిపోతుంది. మరీ ముఖ్యంగా పెళ్లిచూపుల్లో పుష్పకు జరిగిన అవమానం, విలన్ ఇంటికెళ్లి, అతడికి ఛాలెంజ్ చేసే ఎపిసోడ్స్ తొలి అర్థభాగంలో మెరిశాయి. అయితే ఎప్పుడైతే అన్ని పాత్రల పరిచయం, అన్ని ఎలివేషన్స్ ఫస్టాఫ్ లోనే అయిపోయాయో.. అప్పుడిక సెకండాప్ లో చెప్పడానికి దర్శకుడికి ఏం మిగల్లేదు. దీంతో ఇంటర్వెల్ టైమ్ కు అమాంతం లేచిన సినిమా… ఇంటర్వెల్ నుంచి ఫ్లాట్ గా సాగుతుంది. ఓ సాధారణ వ్యక్తి, కింగ్ గా. డాన్ గా ఎలా మారుతాడనే రెగ్యులర్ మాస్ సినిమాల ఫార్ములాలో సాగిపోతుంది.

ఆమధ్య నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన “నార్కోస్” సిరీస్ లో చాలా సన్నివేశాలకు, పుష్ప తొలి అర్థభాగానికి చాలా సారూప్యత కూడా కనిపిస్తుంది. నార్కోస్ స్ఫూర్తితో చాలా సీన్స్ తీసినట్టు అనిపిస్తుంది, సినిమాలో అవి బాగున్నాయి కూడా. అయితే సెకండాఫ్ లో మాత్రం ఆ ఆసక్తి కనిపించలేదు. సీన్ తర్వాత సీన్ నడుస్తుంటుంది తప్ప ఘర్షణ కనిపించదు. తనకి ఇంటిపేరు కూడా లేదు అని అవమానించే అజయ్ పాత్ర అప్పుడప్పుడు వచ్చి అవమానించే సన్నివేశాల వల్ల ద్వితీయార్థంలో కూడా సన్నివేశాలు పండుతాయి. కానీ, ఈ థ్రెడ్ ని కూడా మరీ ఎక్కువ లాగినట్లు అనిపిస్తూంది.

ఫహాద్ ఫాజిల్ పాత్ర ఎంటరయ్యే వరకు సెకెండాఫ్ లో ట్విస్ట్ కనిపించదు. సినిమాలో మరో పెద్ద మైనస్ ఏంటంటే.. పుష్పరాజ్ ఫ్రెండ్ కేశవ వాయిస్ ఓవర్ తో సినిమా స్టార్ట్ అవ్వడం. అలా అని చివరివరకు అది ఉండదు. క్లైమాక్స్ కు చాలా ముందే అది ముగుస్తుంది. సెకెండాఫ్ లో కొన్ని మంచి పాత్రలు కనిపించినప్పటికీ, ప్రభావం చూపించలేకపోయాయి. వీటితో పాటు రన్ టైమ్ కూడా పెద్ద ఇష్యూగా మారింది.

ఈ సినిమాకు అతిపెద్ద బలం అల్లు అర్జున్. అతడి గెటప్, పెర్పార్మెన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. పుష్ప పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు బన్నీ. అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్సుల్లో ఇదొకటి. ఇక చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులకు చప్పట్లు కొట్టాల్సిందే. ఫహాద్ ఫాజిల్ కనిపించిన 15 నిమిషాల్లోనే చాలా ఇంపాక్ట్ చూపించాడు. సెకండ్ పార్ట్ లో అతడి పాత్ర పూర్తిగా డామినేట్ చేసే అవకాశం ఉంది. సునీల్, అజయ్ ఘోష్, అనసూయ, శత్రు, రావురమేష్, ధనుంజయ్ పాత్రల్లో గెటప్స్ డిఫరెంట్ ఉన్నాయి కానీ సరైన నెరేషన్ లేదు. దేనికీ బలమైన ప్రాధాన్యం దక్కలేదు. వాళ్ల మేకప్ ఎక్కువ, పాత్రల లోతు తక్కువ. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె చిత్తూరు యాస కూడా బాగుంది.

టెక్నికల్ గా చూసుకుంటే, దేవిశ్రీ మరోసారి పాటలతో ఆకట్టుకున్నాడు. సుక్కూ-బన్నీతో కలిసి తన కాంబినేషన్ మ్యూజికల్ హిట్ అనిపించుకున్నాడు. సామీ-సామీ, హే బిడ్డ పాటలు బాగున్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవిశ్రీ నిరాశపరిచాడు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో దేవిశ్రీ తన పనితనం చూపించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ విజువల్ ఎఫెక్టులు బాగా లేకపోవడం, సౌండ్ మిక్సింగ్ సరిగ్గా కుదరకపోవడం మైనస్. సినిమాని హడావిడిగా పూర్తి చేశారు. మరింత సమయం తీసుకొని విడుదల చేసి ఉంటే బాగుండేది. టెక్నీకల్ గా లోపాలు ఉండేవి కాదు.

ఫైనల్ మాట
ఓవరాల్ గా చెప్పాలంటే పుష్ప – ది రైజ్ అనేది పూర్తిగా వన్ మేన్ షో. అల్లు అర్జున్ నటప్రతిభ ని ఇందులో చూడొచ్చు. ఫ్లవర్ కాదు, నిజంగానే ఫైర్ అన్న లెవల్లో నటించాడు. కాకపోతే క్యారెక్టర్ లో ఉన్న ఆ ‘ఫైర్’ సినిమా ద్వితీయార్థంలో కనిపించలేదు.

Rating: 2.75/5

By: ‘పంచ్’ పట్నాయక్

 

More

Related Stories