
సినీ మహాకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అభిమానులతో మొదటిసారిగా ట్విట్టర్ వేదికపై చాటింగ్ చేశారు. #AskSirivennela పేరిట కొంతమంది అడిగిన ప్రశ్నలకు సిరివెన్నెల ఇచ్చిన సమాధానాలు మీకోసం…
మీకు బాగా నచ్చిన పుస్తకం?
నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండోది ఖలీల్ జిబ్రాన్ రాసిన “ద ప్రాఫెట్”.
మీరు పాటల రచయిత కాకపోయి ఉంటే?
జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.
ఎక్కువ శ్రమ పడి రాసిన పాట ఏదీ?
పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు.
మీకు నచ్చిన సినిమా, మీ దృష్టిలో సినిమా అంటే?
లిస్టు చాలా పెద్దది, “పిట్టభాష” సరిపోదు. ఇక – కథని చెప్పడం, చూపడం – రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.
బాగా నచ్చిన కవి?
వాల్మీకి
మీరు ప్రయోగించిన, మీరు గర్వించదగ్గ పదం లేదా వాక్యం?
“ప్రశ్న – కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న”
వేటూరి గారు మీ పాటలని మెచ్చుకున్న సందర్భాలు?
చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. “నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే” అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.
మీరు ఎక్కువగా ఏమి చేస్తూ ఉంటారు?
ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను
ఏళ్లుగా రాస్తున్నారు. ఇప్పటిదాకా నిరంతరాయంగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్నది ఏంటి?
అత్యంత తీవ్రతతో ప్రతీ క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం – అదే నా ప్రేరణ.
రచయిత కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి గురువుగారు?
తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం
మీరు రచించని ఇతర పాటలలోని మీరు ఎంతగానో మెచ్చిన పాట ఏది…!?
చాలా! ప్రతీ ఒక్కరూ ఏదోక గొప్ప పాట రాసే ఉంటారు.
మీరు రాసిన పాటల్లో మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన రెండు పాటలు చెప్పండి సర్?
“నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగ” (అల్లరి మొగుడు)
“సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని” (సిరివెన్నెల)
పాట రాసేందుకు మీకు ఇష్టమైన ప్లేస్ ఉందా?
నా బుర్రలో అలజడి!
ప్రేమ పాటలకు మీకు స్ఫూర్తి ఎవరు?
బ్రతుకంతా ప్రేమే! ప్రేమ నుండే ప్రేమ వస్తుంది!
పాటలో ‘నిరాశ / నిస్పృహ లు ‘ వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉధృతిని మోతాదు మించనివ్వం. “నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా… ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా”
యూత్ కి మీరు ఇచ్చే సందేశం?
యూత్ అనేది ఏజ్ కాదు. అదొక ఫేజ్. అదొక స్టేజ్. అది తెలుసుకుంటే – Youth itself is a message.