రాధే రివ్యూ: ఏందీ భాయ్ ఇది!

Seetimaar from Radhe

ఇండియాలో మాస్ మాసాలా సినిమాలకు పెట్టింది పేరు సల్మాన్ ఖాన్. గత సినిమాలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. ఇలాంటి హీరో నుంచి వస్తున్న “రాధే” మూవీ కూడా మాస్ మసాలా ఎంటర్ టైనర్ అనే విషయంపై రిలీజ్ కు ముందే అందరికీ ఓ క్లారిటీ ఉంది.. కాకపోతే అస్సలు ఊహించని అంశం ఏంటంటే.. ఈ మసాలా సినిమాలో సన్నివేశాలన్నీ ఊహించినట్టుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. చివరికి క్లైమాక్స్ కూడా.

మాస్ మసాలా సినిమాల్లో కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హీరో సస్పెండ్ అయిన పోలీసాఫీసర్. డ్రగ్స్ మాఫియా తో నిండిపోయిన ముంబై సిటీని క్లీన్ చేయాలనే లక్ష్యంతో అలా సస్పెండ్ అయిన పోలీస్ ను తిరిగి వెనక్కి తీసుకొస్తారు. అలా సీన్ లోకి వచ్చిన రాధే (సల్మాన్), విలన్ రానా (రణదీప్ హుడా) అరాచకాల్ని ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ.

స్టోరీ సింపుల్. ఇలాంటి సింపుల్ మాస్ కథను నిలబెట్టేవి బలమైన సన్నివేశాలు. ఈ విషయంలో రాధే సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది. రైటింగ్ లో ఎక్కడా గట్టిగా వర్క్ చేసిన ఫీలింగ్ కలిగించదు. సల్మాన్ స్టార్ డమ్ పై నమ్మకంతో.. సీన్స్ అన్నింటినీ పైపైన రాసుకొని, అలా పేర్చుకుంటూ వెళ్లినట్టు కనిపిస్తుంది. దీంతో ఒక దశలో సల్మాన్ తెరపై కనిపిస్తున్నప్పటికీ ”ఇక చాలు భాయ్” అనిపిస్తుంది.

ఉన్నంతలో ఈ సినిమాలో ఆకట్టుకునే అంశం యాక్షన్ సీక్సెన్స్. కొరియన్ మూవీ ”ది ఔట్ లాస్”ను అఫీషియల్ గా రీమేక్ చేసిన ఈ సినిమాలో ఒరిజినల్ కొరియన్ మూవీలో ఫైట్స్ కంపోజ్ చేసిన టీమే, రాధేకు కూడా పని చేసింది. ఉన్నంతలో అవి ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్లు మరీ అతిగా అనిపిస్తాయి.

ఉదాహరణకు కారు లోంచి ఎగిరి, హెలికాప్టర్ లోకి దూకడం లాంటి సన్నివేశాల్ని మరీ చీప్ గా తీశారు. చాలా యాక్షన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉన్నప్పటికీ.. “రాధే”లో మాత్రం ఈ సీన్ నవ్వు తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా సల్మాన్ హెలికాప్టర్ లోకి ఎగిరిన తర్వాత హెలికాప్టర్ షేక్ అవ్వడం లాంటి సీన్స్ చూస్తే.. బాలయ్య తొడకొట్టి ట్రయిన్ ఆపిన సీన్ గుర్తొస్తుంది.

చాలా ఫార్ములా సినిమాలు మంచి ఎంటర్ టైనర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన “క్రాక్” సినిమా దీనికి మరో ఎగ్జాంపుల్. “రాధే” కూడా పక్కా ఫార్ములా సినిమా. కానీ ప్యాక్డ్ గా మాత్రం అనిపించదు. ప్రభుదేవా దర్శకత్వం బోరింగ్ అనిపిస్తుంది. ఉన్నంతలో ఈ సినిమాను ఆదుకునే ఎలిమెంట్ సల్మాన్ ఖాన్ ఛరిష్మా. అతడి స్టార్ డమ్ పైనే రాధే రిజల్ట్ ఆధారపడి ఉంది. చాలా రోజుల తర్వాత స్టయిలిష్ గా కనిపించారు సల్మాన్.

ఇక పాటల విషయానికొస్తే.. సినిమా చివర్లో వచ్చే “సీటీమార్” రీమిక్స్ సాంగ్ ఒక్కటే అన్నింటికంటే బెటర్ అనిపిస్తుంది. అన్నట్టు ఇప్పటివరకు మనం హీరోయిన్ గురించి చెప్పుకోలేదు చూశారా..? హీరోయిన్ కు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యం ఉందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

హీరోయిన్ ని పొట్టి బట్టల్లో చూస్తున్న జనాలకు కొంత వెరైటీ గా ఉంటుందనుకున్నారేమో ఏకంగా 64 ఏళ్ల జాకీష్రాఫ్ కి పొట్టి గౌన్ వేసి సల్మాన్ ఖాన్ తో డ్యాన్స్ చేయించారు. ఇలాంటి పిచ్చి సీన్లు మరికొన్ని ఉన్నాయి.

ఓవరాల్ గా సిల్లీ రైటింగ్, ఫార్ములా సీన్స్ తో రాధే బోర్ కొట్టిస్తాడు. ఈ భాయ్ కచ్చితంగా మోస్ట్ వాంటెడ్ కాదు, ఆన్ వాంటెడ్.

రేటింగ్ 1.75/5

పంచ్: ఆన్ వాంటెడ్

Advertisement
 

More

Related Stories