
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ‘బాహుబలి’ చిత్రాలతో దేశమంతా క్రేజ్ తెచ్చుకున్న హీరో. అందుకే,ఆయనికి సినిమాకి 100 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారు నిర్మాతలు. ఆయన పేరు మీద బిజినెస్ కూడా అలాగే అవుతోంది కూడా.
‘బాహుబలి 2’ తర్వాత వచ్చిన ‘సాహో’ ఆడలేదు కానీ ఓపెనింగ్స్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. ఒక్క హిందీ వర్షెన్ ఇండియాలో దాదాపు 25 కోట్ల రూపాయల ఓపెనింగ్ తెచ్చింది మొదటి రోజు. దాంతోనే, ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో అందరికీ అర్థం అయింది. ‘రాధే శ్యామ్’ కూడా చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబడుతుంది అని అందరూ అంచనాలు కట్టారు. తెలుగులో కన్నా హిందీలోనే ఇది బాగా ఆడుతుందని కూడా కొందరు విశ్లేషకులు భావించారు. ఎందుకంటే… ఆర్జిత్ సింగ్ పాడిన “సోచ్ లియా” పాట బాగా పాపులర్ అయింది.
కానీ, తీరా చూస్తే సీన్ రివర్స్.
‘రాధేశ్యామ్’కి మొదటి రోజు హిందీలో నాలుగున్నర, అయిదు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. హిందీ వర్షన్ కి ఇండియాలో వచ్చిన మొత్తం ఇది. అంటే, ‘సాహో’కి తొలి రోజు వచ్చిందాంట్లో 20 శాతం మాత్రమే. ఎంత దారుణమైన కలెక్షన్లలో అర్థం చేసుకోవచ్చు.
ఇంత తక్కువ రావడానికి ‘భజన’ బృందం చెప్తున్న కారణాలు ఏంటంటే… ‘రాధేశ్యామ్’ క్లాస్ సినిమా, పైగా లవ్ స్టోరీ అని. హిందీ మార్కెట్ లో మాస్ సినిమాలే చూస్తారు… లవ్ స్టోరీ కాబట్టి రాలేదు అనేది వారి వివరణ. మరి, అమెరికాలో ఎందుకు భారీగా రాలేదు? అమెరికాలో ‘క్లాస్’, లవ్ స్టోరీలే ఎక్కువ చూస్తారు కదా!