
హిందీ టీవీ కార్యక్రమాలు చూసేవాళ్లకు కపిల్ శర్మ గురించి బాగా పరిచయం. ఇండియాలో అత్యధిక ఆదాయాన్ని పొందుతోన్న కమెడియన్ కపిల్ శర్మ. అతనితో లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ ఒక షో చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. అందులో కపిల్ శర్మ తన జీవితంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలు బయటపెట్టాడు.
ఒకసారి రాత్రి పూట బాగా తాగి ప్రధాని నరేంద్రమోదీని టాగ్ చేసి “అచ్చే దిన్” ఎప్పుడు అంటూ ఎదో ట్వీట్ చేశాడట. పెద్ద రాద్ధాంతమే జరిగింది. దాని గురించి చెప్తూ… రాత్రి పూట వేసిన ట్వీట్లు తనవి కాదని అవి జానీ వాకర్ వేసినవి కావొచ్చు, ఓల్డ్ మాంక్ వేసినవి కావొచ్చు అంటూ జోక్ చేశాడు.
ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మన తెలుగు కమెడియన్ రాహుల్ రామకృష్ణ వ్యవహారం అలాగే ఉంది. మొన్న రాత్రి సడెన్ గా ఒక ట్వీట్ చేశాడు. “2022 నా చివరి సంవత్సరం. ఆ తర్వాత సినిమాలు చెయ్యను,” అనేది అతని ట్వీట్ సారాంశం. దాంతో, మీడియాలో వార్తలు… అతనికి ఫోన్లు.
మర్నాడు మధ్యాహ్నం అది నేను వేసిన జోక్. ఇంతమంచి డబ్బు తెచ్చే నటనని ఎందుకు వదులుకుంటా అని ట్వీటాడు.
రాత్ గయీ బాత్ గయీ అనే సామెతలాగా తెల్లారగానే ఆయన మాట మారింది. మరి మొన్న రాత్రి ట్వీట్లు వేసింది రాహుల్ రామకృష్ణనేనా లేక కపిల్ శర్మ అన్నట్లు జానీ వాకారా? అన్నది దేవుడికే తెలియాలి.