
మన దేశం తరఫున ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని ఆస్కార్ అవార్డు పరిశీలనకు పంపలేదు. ఐతే, డైరెక్ట్ గా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులను పరిశీలించేందుకు అవకాశం ఉందని గ్రహించిన రాజమౌళి ఇక ఆ పనిలో ఉన్నారు.
ఆస్కార్ అవార్డు నామినేషన్లకు ఒక సినిమా వెళ్లాలన్న అక్కడ చాలా హంగామా చెయ్యాలి. ఓట్లు వేసే వారి దృష్టిలో పడేలా చాలా పబ్లిసిటీ చెయ్యాలి.
రాజమౌళి ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అక్కడి స్థానిక ఏజెన్సీలు, బలమైన నెట్ ఫ్లిక్స్ సంస్థ రాజమౌళికి అండదండలు ఇస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో రాజమౌళి సినిమాలన్నిటిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లతో మీడియా నెట్ (డబ్బులిచ్చి ప్రచారం చేసుకోవడం) ఒప్పందం చేసుకొంది రాజమౌళి టీం. దానికి తోడు, రాజమౌళి టీంకి బలమైన సోషల్ మీడియా వింగ్ ఉంది. ఏమి లేకుండానే ఎదో ఉందని చేసే సోషల్ మీడియా బృందం ఉంది. సో, ఆస్కార్ బరిలో తన సినిమా నిలిచేలా ఏమి చెయ్యాలో అది చేస్తున్నారు రాజమౌళి.
మన ఇండియన్ సినిమా అనే కాదు హాలీవుడ్ చిత్రాలు, అక్కడి నిర్మాణ సంస్థలు కూడా ఆస్కార్ అవార్డుల కోసం, ఓటు వేసే జ్యురీ వారి కోసం “ఫర్ యువర్ కన్సిడరేషన్” (మీ పరిశీలన కోసం) అంటూ ఇలాంటి పబ్లిసిటీ హడావిడి చెయ్యాల్సిందే. ఈ విషయం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే, ఆయన సైలెంట్ గా ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు.
ఆస్కార్ అవార్డుల సందడి ముగిసిన తర్వాతే ఆయన తన తదుపరి చిత్రం స్క్రిప్ట్ మీద కూర్చుంటారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా తీయనున్నారు. యాక్షన్ సినిమా అని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు.
ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తే కనీసం రెండు, మూడు విభాగాల్లో “ఆర్ ఆర్ ఆర్” సినిమా నామినేషన్ వరకు వెళ్లే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, రాజమౌళి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిన వాడు అవుతారు. ఇప్పటికే తెలుగు సినిమాకి మార్కెట్ ని పెంచారు రాజమౌళి. ఇప్పుడు ఆస్కార్ సందడి వరకు తీసుకెళ్తున్నారు.