మళ్ళీ అదరగొట్టిన రాజమౌళి

సినిమా సినిమాకి అంచనాలు పెంచడంలో, అంచనాలు అందుకోవడంలో రాజమౌళిని అందుకునే దర్శకులు లేరు. ఆయన ఊహ భారీగా ఉంటుంది. దాన్ని నిజం చేసేందుకు ఎంత కాలమైనా కష్టపడతారు, ఎంతైనా ఖర్చు పెడుతారు. సినిమా మేకింగ్ కి మూడేళ్లు పట్టినా… క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. తాజాగా విడుదలైన “ఆర్ ఆర్ ఆర్” టీజర్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. విజువల్స్ అదిరిపోయాయి అనేది అందరి మాట.

నిజానికి ఈ టీజర్లో కథ గురించి ఏమి చెప్పలేదు. ఒక్క డైలాగ్ లేదు. కానీ సినిమాలో ఏమి ఉందో ఓ మచ్చు తునకలాంటి గ్లిమ్ప్స్ చూపించారు. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలియచేశారు.

“ఆర్ ఆర్ ఆర్” ఒక ఎమోషనల్ యాక్షన్ సినిమా అనేది ఈ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ మాట. ఫైటింగ్లో ఎమోషన్ ఉంటుందా? అవును, అది ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ మూవీకి అయిన ఖర్చు 400 కోట్ల పైనే.

కీరవాణి తన నేపథ్య సంగీతం టీజర్ మెయిన్ బలం అని చెప్పాలి. మొన్నటివరకు ఈ సినిమాపై నెగటివ్ మాటలు వినిపించాయి. ఎందుకంటే ఇంతకుముందు విడుదలైన ‘దోస్తీ’ అనే పాట పెద్దగా వైరల్ కాలేదు. అంతకుముందు వచ్చిన చిన్న టీజర్స్ ని ఇప్పటికే జనం మర్చిపోయారు. దాంతో, “ఆర్ ఆర్ ఆర్”కి బాహుబలి రేంజ్ హైప్ వస్తుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ, వాటన్నిటిని పటాపంచాలు చేసింది టీజర్.

Advertisement
 

More

Related Stories