TC2022: ఈ ఏడాదీ రాజమౌళిదే!

Rajamouli

ఏడాది ముగుస్తోంది. 2023 దూసుకొస్తోంది. మరి 2022లో టాప్ డైరక్టర్ ఎవరు? ఎలాంటి ఆలోచన లేకుండా అప్రయత్నంగా వచ్చే సమాధానం రాజమౌళి. ఏదైనా ఏడాది రాజమౌళి నుంచి సినిమా రాకపోతే, అప్పుడు టాప్ డైరక్టర్ పై చర్చ ఉంటుంది. రాజమౌళి సినిమా వచ్చినప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి రాదు. అవును.. 2022 టాప్ డైరక్టర్స్ లో మొదటి స్థానం జక్కన్నదే.

ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ (RRR)తో దుమ్ము దులిపారు రాజమౌళి. ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్” తో సంచలనం సృష్టించింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఇప్పటికే రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇచ్చింది. స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి గొప్ప దర్శకులు తీసిన సినిమాలు బరిలో ఉన్న రాజమౌళినే బెస్ట్ డైరెక్టర్ గా ఎంచుకొంది. సో, రాజమౌళి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

దాదాపు మూడున్నరేళ్లు శ్రమించి రాజమౌళి తీసిన ఈ సినిమా 2022 మార్చిలో రిలీజైంది. తెలుగునాట ఇప్పటివరకు అతిపెద్ద హిట్ చిత్రం ఇదే. బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది ‘ఆర్ ఆర్ ఆర్’. కలెక్షన్ల పరంగా సినిమా ‘బాహుబలి 2’ కన్నా ఎక్కువ వసూళ్లు అందుకొంది.

ఐతే, ప్రేక్షకుల సంఖ్య పరంగా మాత్రం ‘బాహుబలి 2’ ముందు దిగదుడుపే. ఐతే, ‘కేజీఎఫ్ 2’ వంటి భారీ చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ అయినప్పటికీ.. తెలుగునాట “ఆర్ఆర్ఆర్”దే రికార్డు.

రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతో. ఈ సినిమా 2023లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ అయ్యేసరికి కనీసం 2025 అవుతుందనే టాక్. 2022 వరకు రాజమౌళి మరోసారి తన డామినేషన్ చూపించారు.

Advertisement
 

More

Related Stories