
ఇండియాలోనే అగ్రదర్శకుడు రాజమౌళి. ఆయనని ఇంట్లో అందరూ నందీ అని పిలుస్తారు. అంతే చనువుగా రాజమౌళిని నందీ అని పిలిచేవారట సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ మహాకవి తన జీవన గమననాన్ని నిర్దేశించారు అని అంటున్నారు రాజమౌళి.
రాజమౌళి సాధారణంగా ఒకట్రెండు ట్వీట్లతో నివాళులు అర్పిస్తారు ఎవరైనా మరణించినప్పుడు. కానీ, సీతారామ శాస్త్రితో తనకున్న ప్రయాణాన్ని గొప్పగా అక్షర రూపంలో పెట్టారు.
1996లో మేము “అర్ధాంగి” అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి.అలాంటి పరిస్థితులలో నాకు ధైర్యాన్నిచ్చి వెన్ను తట్టి ముందుకు నడిపించినవి “ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి” అన్న సీతారామశాస్త్రి గారి పదాలు.
భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది.
అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31 వ తారీకు రాత్రి 10 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను.
‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త NOTEBOOKఆయన చేతుల్లో పెట్టి మీ చేతులతో ఆ పాట రాసివ్వమని అడిగాను… రాసి, ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్న గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కొత్తగా
ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను.
సింహాద్రి లో “అమ్మయినా నాన్నయినా, లేకుంటే ఎవరైనా’ పాట…”మర్యాద రామన్”లో “పరుగులు తియ్” పాట, ఆయనకి చాలా ఇష్టం… అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్ళీ ఆయనే I LIKE THESE CHALLENGES ” అంటూ మొదలు పెట్టారు.
కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ, అర్ధాన్ని మళ్ళీ విపులీకరించి చెప్తూ, ఆయన స్పెల్ లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు…
RRR లో దోస్తీ MUSIC VIDEO LYRIC PAPER లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము… కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. IT WOULD HAVE BEEN A GREAT MEMORY.
నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ… రాజమౌళి.