రజనీకాంత్ కు కోర్టు అక్షింతలు

తమిళ నటులకు వరుసగా కోర్టు నుంచి అక్షింతలు పడుతున్నాయి. మొన్నటికి మొన్న సూర్యను తొలి తప్పు కింద క్షమించి విడిచిపెట్టింది హైకోర్టు. ఇప్పుడు రజనీకాంత్ వంతు. ఆయనకు కూడా చిన్న హెచ్చరిక చేసి విడిచిపెట్టింది మద్రాస్ హైకోర్టు.

చెన్నైలోని కోడంబాకంలో రజనీకాంత్ కు రాఘవేంద్ర కల్యాణ మండపం ఉంది. దానిపై పన్ను చెల్లించాల్సిందిగా అన్నాడీఎంకే ప్రభుత్వం నోటీసులు పంపించింది. మార్చి నుంచి మండపం ఖాళీగా ఉందని, దానిపై ఎలాంటి ఆదాయం లేనందున, ప్రభుత్వం చెప్పిన 6 లక్షల 50వేల పన్ను కట్టడం కుదరదని రజనీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వం విధించిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టుకు రావడం తప్పని హైకోర్టు కోపగించుకుంది. పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు తమకు కొంత సమయం కావాలని రజనీ తరఫు న్యాయవాది కోర్టుకు మొరపెట్టుకున్నారు.

మొన్నటికిమొన్న సూర్య కూడా ఇలానే కోర్టు నుంచి మొట్టికాయలు తిన్నారు. నీట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సూర్య చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించాల్సి ఉంటుందని, మొదటి తప్పుగా సూర్యను క్షమిస్తున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు “యాక్షన్” సినిమాకు సంబంధించిన కేసులో కూడా హీరో విశాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. అతడు నటించిన ‘చక్ర’ సినిమా విడుదల నిలిచిపోయింది.

Related Stories