రజినీకాంత్ రాజకీయ దుకాణం బంద్

- Advertisement -


సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ ఆలోచన విరమించుకున్నట్లు గతేడాది డిసెంబర్ లోనే ప్రకటించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి దుకాణం బంద్ అయింది.

భవిష్యత్ లో కూడా రాజకీయాల ఆలోచన చెయ్యను అని ఈ రోజు (జులై 12) ప్రకటించారు. ఆవిధంగా ఆ లాంఛనం కూడా పూర్తి అయింది.

నెల రోజులు పాటు అమెరికాలో ఉండి హెల్త్ చెకప్ చేయించుకొని మొన్నే ఇండియాకు వచ్చారు రజినీకాంత్. రాగానే అభిమాన సంఘాలను పిలిచారు. ‘రజిని మక్కల్ మందిరం’ అనే తన రాజకీయ సంస్థని ఇకపై అభిమానుల సంఘంగా మార్చాలని అని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆరోగ్య కారణాల వల్లే తాను ఇక ఎప్పటికీ రాజకీయాల ఆలోచన చెయ్యనని క్లారిటీ ఇచ్చారు రజినీకాంత్.

దాదాపు పాతికేళ్ల పాటు “పార్టీ పెడతాను”, “సీఎం అవుతాను” అనే వార్తలను లీక్ చేస్తూ తమిళనాట ఒక సంచలన కేంద్రంగా ఉంటూ వచ్చారు రజినీకాంత్. ఇప్పుడు పోలిటికల్ షాప్ మూసివేశారు.

“తమిళనాట ఆయన మాటే శాసనం”…”ఆయన ఒక్క మాట అంటే చాలు ప్రభుత్వాలు కూలుతాయి” అని ఒకప్పుడు అనేవారు. అంతటి క్రేజుని నిజంగా చూశారు రజినీకాంత్. కానీ గత మూడు, నాలుగేళ్లుగా స్వీయ తప్పిదాలతో ఆయన ఇమేజ్, క్రేజ్ మసకబారింది.ఆయన సినిమాలకు కూడా భారీ ఓపెనింగ్స్ తగ్గిపోయాయి. విషయం అర్థమైంది ఈ సూపర్ స్టార్ కి. పైగా వయసు సహకరించడం లేదు. అందుకే, కంప్లీట్ గా రాజకీయ ఆలోచన చెయ్యనని చెప్పేశారు.

 

More

Related Stories