జైలర్ – తెలుగు రివ్యూ

Jailer

జైలర్… బేసిగ్గా ఇదొక రివెంజ్ స్టోరీ. కాకపోతే మొదటి భాగానికి, ద్వితీయార్థానికి పొంతన ఉండదు. సినిమా ఫస్టాఫ్ సీన్ బై సీన్ అద్భుతంగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం అంత ఆర్గానిక్ గా అనిపించదు. అతుకుల బొంతలా అనిపిస్తుంది. క్లయిమాక్స్ మళ్లీ ఓకే. సెకండాఫ్ కాస్త ఇబ్బందిపెట్టినా సినిమా అంతోఇంతో బాగుందని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు అంటే దానికి కారణం క్లయిమాక్స్.

Advertisement

సినిమాను ఇలా స్టార్ట్ చేసిన వెంటనే నేరుగా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు నెల్సన్. రజనీకాంత్ ఓ రిటైర్డ్ జైలర్. అతడి కొడుకు విగ్రహాల స్మగ్లింగ్ ముఠాపై కన్నేసిన ఓ పోలీసాఫీసర్. ఈ క్రమంలో కొడుకు కిడ్నాప్ అవుతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే కిడ్నప్ అయిన ఆ పోలీస్ అధికారి చనిపోయి ఉంటాడని పోలీసులు తేల్చుతారు. ఆ తర్వాత ఆ విగ్రహాల ముఠా తన భార్య, కోడలు, మనవడిని కూడా టార్గెట్ చేసింది అని గ్రహిస్తాడు. ఈ జైలర్ ఆ ముఠాపై ఎలా పగతీర్చుకున్నాడనేది కథ.

కథా పరంగా చూస్తే ఇందులో గత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. “బుడ్డా హోగా తేరా బాప్”తో పాటు రీసెంట్ గా వచ్చిన “విక్రమ్” సినిమా ఛాయలు కనిపిస్తాయి. అలాగే హాలీవుడ్ చిత్రాల ప్రభావం కూడా ఉంది. అయితే నెల్సన్ కథనం మాత్రం ఆకట్టుకునేలా సాగింది. సీరియస్ గా సాగిపోతున్న కథనానికి, అతడిచ్చిన హ్యూమర్ టచ్ మెప్పిస్తుంది. ఫస్టాఫ్ సాఫీగా సాగిపోవడానికి ఇది ప్రధాన కారణం. దీనికితోడు వయసుకు తగ్గ పాత్రలో రజనీకాంత్ లుక్, అతడి యాక్టింగ్ కట్టిపడేస్తాయి.

ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఓ 15 నిమిషాలు బాగానే ఉంటుంది. అక్కడ్నుండి సడెన్ గా గ్రాఫ్ పడిపోతుంది. మరీ ముఖ్యంగా సునీల్ పాత్ర ఎంటరైన తర్వాత బోర్ ఫీల్ అవుతాం. అతడి క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మనకు “బాద్ షా”, “దూకుడు” సినిమాలు గుర్తొస్తాయి. అక్కడ్నుంచి సినిమాపై తన పట్టుని కోల్పోయారు దర్శకుడు.

అయితే క్లయిమాక్స్ విషయంలో మరోసారి దర్శకుడు తన పనితనం చూపించాడు. ఆకట్టుకునేలా సినిమాను ముగించాడు. అయితే ఇక్కడ కూడా కొన్ని వెబ్ సిరీస్ లు మనకు గుర్తొస్తాయి. అయినప్పటికీ అదేం పెద్ద సమస్య కాదు. ఈ కథకు, ఓ స్టార్ హీరోకు సూటయ్యే క్లయిమాక్స్ ఇది. అంతకుమించి క్లయిమాక్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటే స్పాయిలర్స్ ఇచ్చేసినట్టుంటుంది.

ALSO READ: Jailer Review: Superb first half, shaky finish

రజనీకాంత్ ఇరగదీశారు. ఆయన స్టయిల్, మేనరిజమ్స్ అలా చూస్తూ ఉండాలనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఈమధ్య కాలంలో రజనీ నుంచి వచ్చిన లుక్కు, నటన ఇదే. అయితే ఇందులో కూడా పంటికింద రాయిలా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇబ్బంది పెడుతుంది. అందులో రజనీ లుక్, స్టయిల్ అదిరిపోతాయి, కానీ సన్నివేశాలు మాత్రం పేలవంగా ఉంటాయి. వినాయగన్ విలన్ గా ఓకె. రమ్యకృష్ణ పాత్ర సాదాసీదాగా ఉంది. యోగిబాబు కామెడీ బాగుంది. గెస్ట్ రోల్స్ పోషించిన తమన్న, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అలా మెరుస్తారు. రిలీజ్ కు ముందు వైరల్ అయిన “కావాలయ్యా” పాట, సినిమాలో చూసినప్పుడు మాత్రం ఎందుకో కామెడీగా అనిపించింది. మరీ ముఖ్యంగా తమన్నాకు సెట్ అవ్వలేదనిపించింది.

టెక్నికల్ గా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ, సంగీతం చాలా బాగా కుదిరాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనిరుద్ మరోసారి ఆకట్టుకున్నాడు. ట్రయిలర్ లో ఎట్రాక్ట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాలో మరింతగా ఎలివేట్ అయింది.

ఓవరాల్ గా చూసుకుంటే, “జైలర్” మిశ్రమ స్పందన మిగులుస్తుంది. సెకండాఫ్ పూర్తిగా నీరసం తెప్పిస్తుంది. కాకపోతే, ఫస్ట్ హాఫ్, రజనీకాంత్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.

బాటమ్ లైన్: వన్ మేన్ ‘జైలర్’

Rating: 2.75

Review by: M Patnaik

Advertisement
 

More

Related Stories