రకుల్ కి బంపర్ ఆఫరే!

బాలీవుడ్ లో అత్యధిక చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటి ఎవరు అంటే…. రకుల్ ప్రీత్ సింగ్ పేరే చెప్తారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా ఎనిమిది చిత్రాలు సైన్ చేసిన సుందరి రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్స్ ఆరోపణలు, వివాదాలు వంటివి చుట్టుముట్టినా… అన్నింటినీ తట్టుకొని నిలబడింది. బాలీవుడ్ లో సినిమా ఆఫర్లతో పాటు బాయ్ ఫ్రెండ్ ని కూడా పొందింది. అదీ కూడా కరోనా కాలంలోనే.

లాక్డౌన్ తర్వాత మూడు చిత్రాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఇంకో ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు బాలీవుడ్ లో ఆమె క్రేజ్, రేంజు. ఆమె నటిస్తున్న సినిమాల్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి పెద్ద హీరోలవే కావడం మరో విశేషం.

ఇక, ఆగిపోయింది అనుకున్న మరో భారీ చిత్రం ఇప్పుడు మళ్ళీ ఆమె ఖాతాలో పడింది.

శంకర్ మూడేళ్ళ క్రితం మొదలు పెట్టి కరోనా కాలంలో పక్కకి పెట్టినా “ఇండియన్ 2” (భారతీయుడు 2) బుధవారం (ఆగస్టు 24) మొదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తోంది. సిద్ధార్థ్, అలాగే రకుల్ కూడా నటిస్తున్నారు. ఐతే, రకుల్ పై ఇంతకుముందు పెద్దగా సీన్లు తీయలేదు. ఆమెని మార్చి మరో హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉన్నా శంకర్ ఆ పని చెయ్యలేదు. సో, రకుల్ “ఇండియన్ 2” చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.

సౌత్ లో ఆమె ఇటీవల నటించిన చిత్రాలు ఏవీ ఆడలేదు. తెలుగులో “కొండపొలం”, “చెక్” “మన్మథుడు 2” వంటి అపజయాలు ఉన్నాయి. తమిళంలో “ఎన్జీకే”, “దేవ్” వంటివి ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు చూసే ఇప్పుడు తెలుగులో, తమిళంలో ఆమెకి ఆఫర్లు ఇవ్వడం లేదు. అందుకే, ఆగిపోయిన “ఇండియన్ 2” మళ్ళీ మొదలు కావడం అంటే ఆమెకి బంపర్ ఆఫర్ కింద లెక్కే.

 

More

Related Stories