
కోవిడ్ 19 సెకండ్ వేవ్ కేసులతో ఎక్కడ చూసినా ఒక భయం కనిపిస్తోంది. లాక్డౌన్ పెట్టకతప్పదా అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఫస్ట్ వేవ్ లో బయటపడ్డ సెలెబ్రిటీలందరూ కరోనాకి గురవుతున్నారు. దాంతో పలు సినిమాల షూటింగులు ఆగిపోయాయి. కానీ రామ్ చరణ్, పూజ హెగ్డే మాత్రం వెరవడం లేదు.
కోవిడ్ 19 ప్రొటొకాల్స్ అన్ని పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు రామ్ చరణ్, పూజ హెగ్డే. ప్రస్తుతం వీరిద్దరిపై ఒక పాట తీస్తున్నాడు దర్శకుడు శివ కొరటాల. ఈ నెల 20 వరకు ఈ షెడ్యూలు ఉంటుంది. మరో మూడు రోజుల్లో పాట, కొన్ని సీన్లు పూర్తి అవుతాయి. ఈ టైంలో ఆపితే కష్టమని ఇద్దరూ కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు.
మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోను సూద్ కి కరోనా వచ్చింది. ‘చిరంజీవి’ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో రామ్ చరణ్, పూజ హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు.