చరణ్ ఫ్యాన్స్ భయపడేది అతనికే

- Advertisement -
Ram Charan


తమిళంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకి కొంత ఫాలోయింగ్ ఉంది. ‘పిజ్జా’ అనే సినిమాతో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘జిగర్తాండ’ (తెలుగులో అదే కథతో ‘గద్దలకొండ గణేష్’ అనే సినిమా రూపొందింది) మరింత క్రేజ్ తెచ్చింది. దాంతో కార్తీక్ సుబ్బరాజుకి కొంత కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

కానీ, అతనే ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులను కలవరపెడుతున్నాడు. ఎందుకంటే…

ఈ దర్శకుడు ఇటీవల తీసిన సినిమాలన్నీ ఘోరంగా ఉన్నాయి. అర్థంపర్థంలేని కథ,కథనాలతో తన స్థాయిని తగ్గించుకున్నాడు. రజినీకాంత్ తో తీసిన ‘పెట్టా’ పరాజయం పాలైంది. అందులో కొత్త కథ అంటూ ఏమి లేదు. అలాగే ధనుష్ హీరోగా తీసిన ‘జగమే తంత్రం’ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఆ సినిమా కథ కూడా బాలేదు. సినిమాకి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.

ఇక తాజాగా విక్రమ్, ఆయన కొడుకు ధ్రువ్ హీరోలుగా తీసిన ‘మహాన్’ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత కార్తీక్ సుబ్బరాజు వరుసగా మూడో చిత్రంలో తన ‘సత్తా’ చాటలేకపోయాడు అని అర్థమైంది. ఈ మూడు సినిమాల్లో అతను రాసుకున్న కథలు, కథనాలు పేలవంగా ఉన్నాయి. అందుకే, రామ్ చరణ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శంకర్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరు కదా. ఐతే, ఈ సినిమాకి కథ అందించింది ఎవరో కాదు …. ఈ కార్తీక్ సుబ్బరాజే. శంకర్ మంచి కథ కావాలని అడిగితే కార్తీక్ సుబ్బరాజు తాను రాసుకున్న స్క్రిప్ట్ ఇచ్చాడట. దాన్నే ఇప్పుడు శంకర్ తీస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజు ఆ మూడు చిత్రాల కథలు చూశాక ఎవరికైనా టెన్షన్ కలుగుతుంది కదా. ఐతే, చరణ్ ఫ్యాన్స్ కున్న ధీమా శంకర్. కథ కన్నా శంకర్ సినిమాలో ఆయన మేజిక్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన టేకింగ్ మెస్మరైజ్ చేస్తాయి.

 

More

Related Stories