
మహేష్ ఆల్రెడీ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు. బన్నీ చేతిలో ఏకంగా 2 సినిమాలున్నాయి. అటు ప్రభాస్ చేతిలో కూడా 2 సినిమాలున్నాయి. పవన్ కల్యాణ్ కూడా ఎన్నడూలేని విధంగా 3 సినిమాలతో బిజీ అయ్యాడు. చిరంజీవి అయితే పెద్ద లిస్ట్ పట్టుకొని కూర్చున్నారు.
ఇలా బడా హీరోలంతా బిజీ అయిపోయారు. దీంతో ఓ మంచి కథ చెప్పి వెంటనే సెట్స్ పైకి వెళ్దామనే ఆలోచనలో ఉన్న దర్శక-నిర్మాతలంతా ఇప్పుడు చరణ్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఒక్కడే బడా హీరోల్లో అంతోఇంతో ఖాళీగా కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు ఇప్పటివరకు కొత్త సినిమా ఎనౌన్స్ చేయకపోవడమే.
ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” పనిమీద ఉన్న చరణ్.. తన కొత్త సినిమా ప్రకటనకు ఇంకాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే “ఆర్ఆర్ఆర్” తో పాటు నిర్మాతగా “ఆచార్య” కూడా పూర్తిచేయాల్సి ఉంది. “ఆచార్య”లో కూడా చరణ్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు.
అందుకే కొత్త సినిమాపై అప్పుడే కంగారు పడడం లేదు చెర్రీ. ఇది మిగతా దర్శకులు, నిర్మాతలకు వరంగా మారింది. చాలామంది ఇప్పుడు కథలతో చరణ్ వెంట పడుతున్నారు. చరణ్ కూడా ఏమాత్రం విసుగు చెందకుండా అందరి కథలు వింటున్నాడు. ఇలా లిస్ట్ లో వంశి పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి నుంచి వేణు శ్రీరామ్ వరకు చాలామంది చేరారు.
అయితే వీళ్లలో చరణ్ ఎవరికి “ఆర్ఆర్ఆర్” తర్వాత అవకాశం ఇస్తాడనేది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు.