పుకారుగానే మిగిలిన చరణ్ ‘పాత్ర’

Ram Charan

‘లియో’ విడుదలకు సరిగ్గా వారం రోజులకు ముందు ఒక ప్రచారం గుప్పుమంది. హీరో రామ్ చరణ్ “లియో” సినిమాలో కనిపించనున్నాడు అనేది వార్త. దానికి తగ్గట్లు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కానీ ఆయన టీం కానీ మౌనం పాటించారు. చరణ్ లేడని కానీ, ఉన్నాడని కానీ చెప్పలేదు.

ఐతే, రామ్ చరణ్ టీం మాత్రం అది ఉతుత్తి ప్రచారం అని చెప్పింది. కానీ, కొందరిలో ఆ డౌట్ ఉండిపోయింది. బహుశా ‘సర్ప్రైజ్’ చేద్దామనుకుంటున్నారేమో అని. కానీ, అది ఇప్పుడు పుకారు అని తేలిపోయిందిగా. ‘లియో’ సినిమా చివర్లో కమల్ హాసన్ గొంతు వినిపించడం తప్ప ఈ హీరో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వలేదు. ఈ సినిమా ఆసాంతం విజయ్ మాత్రమే ఉన్నాడు. ‘విక్రమ్’ సినిమాలో సూర్య అతిథిగా నటించినట్లు ఎవరూ ఇందులో నటించలేదు.

మరి, రామ్ చరణ్ ‘అతిథి పాత్ర’ అనే ప్రచారం ఎందుకు వచ్చింది?

రామ్ చరణ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ని సెట్ చెయ్యాలని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆ మధ్య ప్రయత్నించింది. అలాగే ఒక తమిళ నిర్మాణ సంస్థ కూడా అనుకొంది. చరణ్, లోకేష్ కలుసుకున్న మాట వాస్తవమే. త్వరలోనే కలిసి ఒక సినిమా చేద్దామని కూడా ఇద్దరూ అనుకున్నారు. ఐతే, ఆ ‘త్వరలో’ అనేది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేం.

రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు. అది పూర్తి కాగానే దర్శకుడు బుచ్చిబాబు తీసే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తాడు. ఈ రెండూ పూర్తి అయ్యేసరికి 2024 ముగుస్తుంది. 2025లో రామ్ చరణ్, లోకేష్ సినిమా చెయ్యొచ్చు. కానీ, లోకేష్ తన తదుపరి చిత్రంగా రజినీకాంత్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ‘విక్రమ్ 2’ కానీ, ‘ఖైదీ 2’ కానీ తీద్దామనుకుంటున్నారు. దానికి తోడు, ప్రభాస్ తో ఒక సినిమా కూడా చెయ్యాలి.

మరి రామ్ చరణ్ తో ఎప్పుడు ఉంటుంది? అదే తేలలేదు. లేదంటే, ఈ గ్యాప్ లో ఏదైనా చిత్రంలో రామ్ చరణ్ ని గెస్ట్ గా నటింపచేస్తారా?

Advertisement
 

More

Related Stories