
రామ్ పోతినేని ఒకప్పుడు స్లిమ్ గా స్మార్ట్ గా ఉండేవాడు. చిక్నా అన్నట్లుగా కనిపించేవాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మాస్ అవతారంలోకి ఒదిగిపోయాడు. అదే పద్దతిలో సాగుతున్నాడు. ఇక తాజాగా చాలా లావుగా మారాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత లావుగా కనిపించలేదు.
ఈ ఒళ్ళు చెయ్యడం అంతా కొత్త సినిమాలో పాత్ర కోసమేనంట. రామ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాలో రామ్ చాలా బలిష్టంగా కనిపించాలి. బలమైన హీరోని ఢీకొనే మొనగాడుగా కనిపించాలంటే ఆ రేంజ్ లో ఆహార్యం ఉండాలి కదా. అందుకే, బోయపాటి స్టైల్ లో బలిష్టంగా మారాడు రామ్.
ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది. సినిమా షూటింగ్ మాత్రం అంతకన్నా ముందే అయిపోతుంది. షూటింగ్ పుర్తి అయ్యాక మళ్ళీ స్లిమ్ అవుతాడట. ఆ తర్వాతే కొత్త సినిమాలు ఒప్పుకునే ఆలోచనలో ఉన్నాడు.
రామ్ – బోయపాటి చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ‘లెజెండ్’, ‘సింహా’, ‘దమ్ము’, ‘అఖండ’ తరహాలో రెండు, మూడు అక్షరాలతో చిన్న టైటిల్ ఉంటుందా లేక ‘జయ జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’లా చాంతాడంత టైటిల్ పెడుతారా అన్నది చూడాలి.