అన్నీ ఆలోచించే వారియర్ చేశా: రామ్

డీఎస్పీ సత్య పాత్రలో రామ్ నటించిన సినిమా ‘ది వారియర్’. లింగుస్వామి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా రామ్‌తో చిట్ చాట్… 

‘ది వారియర్’ ప్రయాణం ఎలా మొదలైంది.. మధ్యలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?

పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అన్నీ రొటీన్ అనిపించాయి. లింగుస్వామి కథ కూడా పోలీస్ స్టోరీనే అని ఆయన వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఫార్మాలిటీగా వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా.

‘వారియర్’ కథలో సోల్ నాకు బాగా నచ్చింది. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే… లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా.

ఈ సినిమా టైమ్ లో పెద్ద గాయమైంది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత 3 నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! సినిమాలే లైఫ్ అనుకునే నేను తొందరగా రికవర్ అయ్యాను.

‘ది వారియర్’తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ డెబ్యూ గురించి… తమిళ డబ్బింగ్ గురించి చెప్పండి?

నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్… రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది. అన్నీ ఆలోచించే ఇది ఒప్పుకున్నా. నేను చెన్నైలో పెరిగాను కదా, తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. నేను ఒక్కడినే డబ్బింగ్ చెప్పాను. నా తమిళ డబ్బింగ్ చూసి లింగుస్వామి షాక్ అయ్యారు. ‘అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పారు. నేను ఊహించలేద’ని అన్నారు.  

ఇటు హీరోయిన్.. అటు నిర్మాత.. ది బెస్ట్…

నిర్మాత శ్రీనివాస చిట్టూరితో చేసిన వాళ్లంతా మళ్లీ మళ్లీ ఆయనతో చేస్తారు. ఆయన చాలా సైలెంట్. ఈ సినిమాకే కాదు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను చేయబోయే సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. కృతికి వర్క్ మీద చాలా డెడికేషన్ ఉంది. గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి. 

బోయపాటితో చేయబోయే సినిమా గురించి…

నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బోయపాటి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీద వేశా. ఇక హరీశ్ శంకర్, అనీల్ రావిపూడి లాంటి దర్శకులతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా వల్ల మనకు బ్రేక్స్ వచ్చాయి. అందుకని, ‘ది వారియర్’ విడుదల తర్వాత బోయపాటి శ్రీను సినిమా స్టార్ట్ చేస్తున్నాను.

Advertisement
 

More

Related Stories