రామ్ మాస్ మంత్రమెన్నాళ్ళు?

Ram Pothineni

ఏ ముహూర్తాన “ఇస్మార్ట్ శంకర్” సినిమా హిట్టయిందో కానీ అప్పట్నుంచి మాస్-యాక్షన్ మంత్రం జపిస్తున్నాడు రామ్. సాఫ్ట్ స్టోరీస్ పూర్తిగా పక్కన పెట్టేశాడు. అతడు చేసిన “రెడ్”, “వారియర్” సినిమాలన్నీ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్లే. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా మాస్ మూవీ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే, అక్కడున్నది బోయపాటి.

అయితే ఈ సినిమాతో రామ్, తన ‘మాస్’ ప్రయోగాలకు చిన్న విరామం ఇవ్వాలని అనుకుంటున్నాడట.

“రెడ్”, “వారియర్” సినిమాలతో అనుకున్న ఫలితాలు రాకపోవడంతో, మాస్ రూట్ నుంచి కాస్త పక్కకొచ్చి గౌతమ్ మీనన్ తో సినిమా లాక్ చేశాడు. గౌతమ్ మీనన్ సినిమాల్లో యాక్షన్ ఉండొచ్చేమో కానీ, మాస్ ఎలిమెంట్స్ మాత్రం మచ్చుకు కూడా కనిపించదు. అతడిదంతా క్లాస్ వ్యవహారం.

ఇలాంటి దర్శకుడితో సినిమా చేయాలని రామ్ కు అనిపించిందంటే, కొన్నాళ్ల పాటు అతడు మాస్ సినిమాలు పక్కన పెట్టాడనే అనుకోవాలి. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. బోయపాటితో చేస్తున్న సినిమా పెద్ద హిట్టయితే, రామ్ మరోసారి మాస్ బాట పట్టే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories