
పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించడం ఉత్తర భారతంలో ఉన్న సంప్రదాయం. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు సీనియర్ నటులు, దర్శకుల పాదాలకు బాలీవుడ్ హీరోలు నమస్కరిస్తుంటారు. హైదరాబాద్ లో కూడా అలాగే చేశారు బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్. రాజమౌళి కాళ్లకు ఆయన నమస్కరించడంతో ఆ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్రం’ (తెలుగు టైటిల్) అన్ని భాషల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. కానీ ఈ సినిమా ప్రొమోషన్ అప్పుడే మొదలుపెట్టారు. ఈ సినిమాని రాజమౌళి సమర్పించనున్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ వేదికపైకి రణబీర్ కపూర్ ని పిలిచినప్పుడు అతను రాజమౌళి పాదాలకు నమస్కరించాడు.
రాజమౌళి కూడా రణబీర్ ని చాలా పొగిడారు. “బాలీవుడ్ మీడియా చాలా సార్లు అడిగింది నాకు ఇష్టమైన బాలీవుడ్ నటుడు ఎవరు అని. రణబీర్ కపూర్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ‘రాక్ స్టార్’ కానీ, ‘సంజూ’ కానీ అతని నటనలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. కళ్ళతోనే భావాలు పలికిస్తారు. బ్రహ్మాస్త్రలో ‘శివ’ పాత్రకి పర్ఫెక్ట్ చాయిస్ అతను,” అని అన్నారు రాజమౌళి.
ఈ కార్యక్రమంలో అలియా భట్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్ కూడా పాల్గొన్నారు.