రంగబలి – తెలుగు రివ్యూ

- Advertisement -
Rangabali

వరుసగా ఫ్లాపులిస్తున్నాడు నాగశౌర్య. అతడి సినిమాలకు పెద్దగా బజ్ రాలేదు. ఎట్టకేలకు “రంగబలి” సినిమా ఆశలు రేకెత్తించింది. టీజర్/ట్రయిలర్ హిట్టవ్వడం, కమెడియన్ సత్య చేసిన స్పూఫ్ ఇంటర్వ్యూ క్లిక్ అవ్వడం సినిమాపై అంచనాలు పెంచింది. అలా భారీ అంచనాలతో వచ్చిన “రంగబలి” సినిమా నాగశౌర్యకు సక్సెస్ అందించిందా లేదా?

రాజవరం అనే ఊరు. అందులో రంగబలి అనే సెంటర్. ఆ ఊరిలో శౌర్య అలియాస్ షో అనే కుర్రాడు. అతడికి లోకల్ ఫీలింగ్ ఎక్కువ. ఊరిలో ఉంటేనే బలం అని ఫీల్ అవుతుంటాడు. బి.ఫార్మసీ చేసిన శౌర్యకు, తన తండ్రి మెడికల్ షాపులో మందులు అమ్మడం కూడా తెలియదు. దీంతో అతడ్ని బలవంతంగా సిటీకి పంపిస్తాడు తండ్రి. అక్కడ సహజ (యుక్తీ తరేజా)ను చూసి ప్రేమలో పడతాడు శౌర్య. ఆమెను పెళ్లి వరకు తీసుకొస్తాడు. కానీ సరిగ్గా అక్కడే చిక్కొచ్చి పడుతుంది. తన ఊరిలో ఉన్న రంగబలి సెంటర్ కు, శౌర్య ప్రేమకు కాన్ ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. రంగబలి సెంటర్ కు పేరు మార్చాలని డిసైడ్ అవుతాడు హీరో. మరి తన ఫేవరెట్ సెంటర్ కు అతడు పేరు మార్చగలిగాడా? తన లవ్ ను సక్సెస్ చేసుకోగలిగాడా? ఇది సినిమా స్టోరీ.

ఈ మధ్య కాలంలో ఇది కొత్త పాయింటే. ఓ సెంటర్ కు, లవ్ కు లింక్ పెట్టడం అనేది కాస్త కొత్తగానే ఉంది. కానీ దాన్ని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడు దర్శకుడు పవన్ బాసంశెట్టి. మరీ ముఖ్యంగా కీలకమైన సెకెండాఫ్ లో అతడి రైటింగ్ మెరవలేదు. హీరో-విలన్ కు మధ్య భీకరమైన యాక్షన్ లేదా ఎమోషన్ పెట్టాల్సిన టైమ్ లో తనకుతానే లిమిటేషన్స్ పెట్టుకొని, నెరేషన్ ను నీరుగార్చాడు దర్శకుడు. సినిమాలో కామెడీపై పెట్టిన ఫోకస్ లో కొంతైనా సెకెండాఫ్ లో సన్నివేశాలు, క్లయిమాక్స్ పై పెడితే సినిమా ఆసక్తిగా ఉండేది.

హీరో ఇంట్రడిక్షన్ తో సినిమాను స్టార్ట్ చేశాడు దర్శకుడు. అతడి పాత్ర తీరుతెన్నులు, రంగబలి సెంటర్, ఇతర పాత్రల పరిచయాల్ని ఒక్కొక్కొటిగా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వచ్చిన కాలేజీ ఎపిసోడ్, ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ మెప్పిస్తాయి. ఎప్పుడైతే సెకండాఫ్ స్టార్ట్ అవుతుందో కీలకమైన సన్నివేశాల్ని ఎంగేజింగ్ గా నడిపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే రెండో భాగాన్ని సీరియస్ గా చెప్పాలా, మొదటి భాగంలానే సరదా సరదాగా నడిపించాలా అనే డైలమాలో పడ్డాడు దర్శకుడు. క్లయిమాక్స్ వరకు ఆ డైలమా అలానే కనిపించింది. దీంతో సినిమా నీరసంగా మారింది.

నాగశౌర్య తన పాత్రకు వందశాతం ఇచ్చాడు. అతడి కామెడీ టైమింగ్, మాస్ అప్పీల్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. సిక్స్ ప్యాక్ లో అదరగొట్టాడు శౌర్య. ఇక శౌర్య తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర కమెడియన్ సత్యది. ఎదుటోడు బాగుంటే చూడలేని కుళ్లుబోతు పాత్రలో సత్య అద్భుతంగా నటించాడు. అతడి కామెడీ ఈ సినిమాకు హైలెట్. ఇంకా చెప్పాలంటే, సత్య కామెడీ కోసం రంగబలి సినిమాను ఒక్కసారైనా చూడాల్సిందే.

హీరోయిన్ ను దర్శకుడు రెండు విధాలుగా చూపించాడు. సన్నివేశాల్లో సింపుల్ గా, సాంగ్స్ లో సెక్సీగా చూపించాడు. ఈ రెండు షేడ్స్ లో యుక్తి తన టాలెంట్ చూపించింది. టాలీవుడ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు రావొచ్చు. విలన్ గా షైన్ టామ్ చాకో, హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ, హీరో సైడ్ కిక్ గా రాజ్ కుమార్, విలన్ సైడ్ కిక్ గా గేయరచయిత అనంతశ్రీరామ్, హీరో తండ్రిగా గోపరాజు రమణ తమ పాత్రల్లో ఒదిగారు. ఐతే విలన్ పాత్ర బలంగా లేదు.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే. పవన్ సీహెచ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు క్లిక్ అవ్వకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా రంగబలి సినిమా ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ చప్పగా సాగింది. సినిమా చివరికి కంగాళీగా మారింది. సెకండాఫ్ అస్సలు చూడలేం.

బాటమ్ లైన్: కంగాళీ

Rating: 2/5

By M Patnaik

More

Related Stories