
హీరోయిన్ గా రష్మిక ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది. తెలుగులో “పుష్ప” వంటి పాన్ ఇండియా హిట్స్, బాలీవుడ్ లో “యానిమల్” వంటి మెగా బ్లాక్ బస్టర్లు అందుకొని రష్మిక అగ్ర హీరోయిన్ గా తన స్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది. ఐతే, ఇప్పటివరకు తన నటన వేరు. ఇకపై జనం చూసే అభినయం వేరు అని చెప్తోంది రష్మిక.
ఇప్పుడు నటిగా తనకు పరిణతి వచ్చింది అని చెప్పుకుంటోంది.
“ఇప్పుడు నటిగా, వ్యక్తిగా అనుభవం వచ్చింది. ఇప్పుడు మరీ 20 ఏళ్ల అమ్మాయిని కాదు కదా. జీవితంలో చూసిన అనుభవాలు, నటిగా పలు సినిమాలు చెయ్యడం వల్ల వచ్చిన తెలివి వల్ల ఇప్పుడు పాత్రలను, ఆ పాత్రల స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోగలుగుతున్నా. “యానిమల్” సినిమాలోనే ఆ తేడా మీకు కనిపించింది. అందుకే, ఆ పాత్రకు అంతగా ప్రశంసలు దక్కాయి. ఇక “పుష్ప 2″లో ఇంకా మరింత పరిణతి కనిపిస్తుంది,” అని ఆమె వివరించింది.
అలాగే “పుష్ప 2″లో పాత్ర పరంగా కూడా శ్రీవల్లి పాత్రకి మెచ్యూరిటీ వస్తుంది. సో, ఆ తేడా రెండో భాగంలో ఉంటుంది అని చెప్తోంది రష్మిక.

పలువురు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేశాక ఆమెకి ఒక పాత్రని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా వైవిధ్యం చూపాలో స్పష్టంగా తెలిసి వచ్చిందట.
రష్మికకి ఇప్పుడు 27 ఏళ్ళు. “పుష్ప 2”, “ధనుష్ – శేఖర్ కమ్ముల మూవీ” కాకుండా ఆమె “రెయిన్ బో”, “ది గర్ల్ ఫ్రెండ్” అనే రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తోంది.