రష్మిక ‘మసాలా’ మాట

Rashmika

రష్మికకి డిప్లమాటిక్ గా ఎలా మాట్లాడాలో తెలీదు అనుకోవాలి. ఆమె ఇటీవల చేస్తున్న కామెంట్స్ ఆమె దక్షిణాది అభిమానులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే సొంత ప్రజలు (కన్నడ ప్రేక్షకులు) ఆమెకు యాంటీ అయ్యారు. ఇప్పుడు తెలుగు, తమిళ వాళ్ళు కూడా ఆమెపై మండిపడేలా మాట్లాడింది అని సోషల్ మీడియాలో ఒక కామెంట్ చక్కర్లు తిరుగుతోంది.

ఇంతకీ రష్మిక అన్న మాట ఏంటో…. చూద్దాం.

“రొమాంటిక్ సాంగ్స్ అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్ పాటలే. రొమాంటిక్ పాటలు వినాలి, చూడాలి అనుకున్నప్పుడు చిన్నపటి నుంచి బాలీవుడ్ వైపే చూసేవాళ్ళం. మా సౌత్ లో ఎక్కువగా డ్యాన్స్ తో కూడిన మసాలా పాటలు ఉంటాయి. ఇది నా మొదటి బాలీవుడ్ రొమాం టిక్ సాంగ్. పాట చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా,” అని చెప్పింది రష్మిక.

ఆమె నటించిన రెండో హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ కామెంట్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ఒక రొమాంటిక్ డ్యూయెట్ చేసింది. తన పాట గురించి పబ్లిసిటీ చేసుకునే క్రమంలో ఇలా సౌత్ సినిమాల్లో మసాలా పాటలు తప్ప రొమాంటిక్ సాంగ్స్ ఉండవు అన్నట్లుగా మాట్లాడింది.

నిజానికి ఆమె బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ అంటే చిన్నపటి నుంచి ప్రత్యేక అభిమానం అని చెప్పాలి అనుకున్నది. కానీ, బాలీవుడ్ ని పొగిడే క్రమంలో సౌత్ సినిమాల్లో మసాలా తప్ప రొమాన్స్ ఉండదు అన్నట్లుగా మాట్లాడింది.

భావం కన్నా వ్యక్తీకరణ ముఖ్యం. ముఖ్యంగా ప్రతిదీ వైరల్ చేసే ఈ రోజుల్లో కొందరి “మనోభావాలు” సులువుగా దెబ్బతింటాయి. అందుకే, రష్మిక ఇప్పుడు మళ్లీ ట్రోలింగ్ కి టార్గెట్ గా మారింది.

 

More

Related Stories