
మాస్ మహారాజా రవితేజ సినిమాలకు “హిందీ డబ్బింగ్ రైట్స్” ద్వారా వచ్చే మొత్తం చాలా ఎక్కువ. దాదాపు 20, 25 కోట్ల రూపాయలు అక్కడినుంచే వస్తుంది. అందుకే, రవితేజ తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటారు. నిర్మాతలు కూడా ఆనందంగా ఆయనతో సినిమాలు నిర్మిస్తున్నారు.
మన తెలుగు హీరోలు నటించిన తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి శాటిలైట్ ఛానెల్ల్లో, యూట్యూబ్ లలో విడుదల చేస్తే ఇంత మొత్తం వస్తున్నప్పుడు సినిమాని థియేటర్లో విడుదల చేస్తే ఎంత రావాలి? ఈ ఆలోచన అందరి హీరోలకు “పాన్ ఇండియా” క్రేజ్ పెంచింది. హిందీలో డబ్ చేసి నార్త్ ఇండియాలో థియేటర్లలో విడుదల చేసే పద్దతి మొదలైంది. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “కార్తికేయ 2” నార్త్ ఇండియన్ మార్కెట్ లో విడుదలైనప్పుడు వచ్చిన కలెక్షన్లు చూసిన తర్వాత తెలుగు మిడ్ రేంజ్, పెద్ద హీరోలు అందరూ అదే బాట పట్టారు.
నాని (దసరా), బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్ పోతినేని… ఇలా పలువురు హీరోలు ఇటీవల తమ సినిమాలను అలా హిందీ మార్కెట్ లో రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు. తాజాగా రవితేజ కూడా అదే పని చేశారు.
“టైగర్ నాగేశ్వరరావు” సినిమాని తన మొదటి పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసుకొని పెద్ద ఎత్తున హిందీలో విడుదల చేశారు రవితేజ. ఐతే, హిందీ మార్కెట్ లో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. రవితేజ ముంబైకి వెళ్లి ప్రొమోషన్ కోసం పెట్టిన ఖర్చు కూడా రాలేదు.
తెలుగులో “టైగర్ నాగేశ్వరరావు” మొదటివారం మంచి వసూళ్లే అందుకొంది. నార్త్ మార్కెట్ లో మాత్రం జీరో. మిగతా తెలుగు హీరోల మాదిరిగానే రవితేజ కూడా హిందీ థియేటర్ మార్కెట్ లో వీక్ అని ప్రూవ్ అయింది. సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్ రావాలి. కానీ అది కూడా రాలేదు.