కాంగ్రెస్ వల్లే నలుగురు పిల్లలు!


‘రేస్ గుర్రం’ సినిమాలో మద్దాలి శివారెడ్డిగా నటించిన రవి కిషన్ గుర్తున్నాడా? భోజ్ పూరి సినిమా పరిశ్రమలో పెద్ద హీరోగా గుర్తింపు పొందిన రవికిషన్ ఇప్పుడు ఒక కామెంట్ తో వార్తల్లో మనిషిగా మారారు.

ఈయన ప్రస్తుతం బీజేపీ ఎంపీ. యూపీలోని గోరఖ్ పూర్ లోక్ సభ నుంచి గత ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై గెలిచారు. తన పొలిటికల్ కెరీర్ ని కాంగ్రెస్ నుంచి ప్రారంభించిన రవి కిషన్ ఇప్పుడు దేశంలో అన్ని సమస్యలకు కాంగ్రెస్ కారణం అంటున్నారు. ఆఖరికి తాను పిల్లలను కనడానికి కూడా కాంగ్రెస్ అంటూ నిందిస్తున్నారు.

ఇంతకీ అసలు మేటర్ ఏంటంటే… దేశంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరికి మించి పిల్లలను ఎవరూ కనొద్దని చట్టం తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. దానికి మద్దతుగా రవికిషన్ తన గళం విప్పారు. 53 ఏళ్ల రవి కిషన్ కి నలుగురు పిల్లలు – ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు. ఇలా తన భార్య నలుగురు పిల్లలను కనడానికి కారణం కాంగ్రెస్ ఇంతకుముందే జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాకపోవడం అంటున్నారు.

అప్పుడే కాంగ్రెస్ చట్టం చేసి ఉంటే తాను తన భార్యని పిల్లల కోసం ఇబ్బంది పెట్టే వాడిని కాదు కదా అనేది ఇతని లాజిక్. ఐతే, రవికిషన్ ఈ మాటతో ట్రోలింగ్ కూడా ఎదుర్కుంటున్నారు. “ఇంకా నయం… నీకు మూడు రాకపోతే కూడా కాంగ్రెస్ కారణం అని నిందించలేదు”, “అవును నిజంగానే కాంగ్రెస్ ఇంతకుముందే జనాభా నియంత్రణ చట్టం తెచ్చి ఉండాల్సింది. అప్పుడు రవి కిషన్ కూడా పుట్టేవాడు కాదు. ఆయన తన తల్లితండ్రులకు నాలుగో సంతానం మరి.” ఇలాంటి ట్రోలింగ్స్ రన్ అవుతున్నాయి.

‘కిక్ 2’, ‘సుప్రీం’, ‘సాక్ష్యం’, ‘సైరా’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి ఇతర తెలుగు చిత్రాల్లో కూడా నటించారు రవి కిషన్.

Advertisement
 

More

Related Stories