
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి ‘RC15’ అని దీన్ని వ్యహరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కొంది. ఇంకా షూటింగ్ కూడా మొదలుకాని ఈ సినిమా కథ నాది అంటూ ఒక తమిళ రచయిత ఆరోపణలు చేస్తున్నారు. “పిజ్జా”, “జగమే తందిరం”, “పెట్టా” వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజు టీంలో పనిచేసిన సెల్లముత్తు చేస్తోన్న ఆరోపణ ఇది.
ఇప్పటికే ఆయన రచయితల సంఘం వద్ద ఫిర్యాదు చేశారు. తాను కార్తీక్ సుబ్బరాజు కోసం కథ తయారుచేసి ఆయనకి వినిపించానని అంటున్నారు సెల్లముత్తు. ఐతే, దాన్ని తన అనుమతి లేకుండా, తనకి నయాపైసా ఇవ్వకుండా, పేరు వేయకుండా శంకర్ సినిమా తీస్తున్నాడని ఆయన అంటున్నారు.
కార్తీక్ సుబ్బరాజు నుంచి మూల కథ తీసుకొని తాను స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను అని శంకర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారట. దాంతో, సెల్లముత్తు అలెర్ట్ అయ్యారు. వెంటనే రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు శంకర్ తన స్క్రిప్ట్ ని రచయితల సంఘానికి వినిపించాలి. సెల్లముత్తు కథ, ఇది ఒకటి కాకపొతే సమస్య లేదు. లేదంటే శంకర్ అతనికి పేరు ఇవ్వాలి. మనీ కూడా చెల్లించాలి.
దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో కియారా, అంజలి నటిస్తున్నారు. ఈ నెలలోనే లాంఛనంగా లాంచ్ చేసి షూటింగ్ షురూ చేయాలనుకుంటున్నారు.