ఎన్టీఆర్ 30 ఆలస్యానికి కారణమిదే!

కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఆగస్టు అన్నారు. ఆ తర్వాత దసరా అని చెప్పారు. తర్వాత నవంబర్ ముహూర్తం అని వినిపించింది. కానీ అసలు స్టేటస్ ఏంటి?

తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది.

కొరటాల శివ ఇంకా స్క్రిప్ట్ పని పూర్తి చెయ్యలేదు. ముందు రాసుకున్న కథలో చాలా మార్పులు చేశారు. ఆ తర్వాత హీరోకి వినిపించారు. ఎన్టీఆర్ కొన్ని మార్పులు చెప్పారు. ఇప్పుడు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసి పనిలో నిమగ్నం అయ్యారు కొరటాల శివ. ఈ నెలాఖరుకి అది కొలిక్కి వస్తుంది.

సాధారణంగా కొరటాల శివ స్క్రిప్ట్ కోసం ఇన్ని నెలలు తీసుకోరు. కానీ, “ఆచార్య” దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ షాక్ నుంచి బయటపడి ఈసారి ఎటువంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో ఎక్కువ కసరత్తు చేస్తున్నారు కొరటాల శివ. ఒకటికి పది సార్లు ప్రతి సీన్ ని అలోచించి రాసుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా అదే మాట చెప్పారట. వేగంగా పూర్తి చెయ్యడం కాదు పకడ్బందీ స్క్రిప్ట్ ముఖ్యం అని చెప్పారు ఎన్టీఆర్. అందుకే ఇంత ఆలస్యం.

NTR30

ఈ సారి గురి తప్పదు అని కొరటాల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ కి పెద్ద హిట్ ఇవ్వాలి, తన కెరీర్ లో మరోసారి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవాలని కసిగా పనిచేస్తున్నారు కొరటాల శివ. అన్ని అనుకున్నట్లు పూర్తి అయితే నవంబర్ రెండో, మూడో వారంలో మొదలు కావొచ్చు.

 

More

Related Stories